హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతలు పొర్లు దండాలు పెట్టినా ఆ పార్టీకి ఓటమి తప్పదని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ స్పష్టం చేశారు. ఆ పార్టీ రెండో జాబితా ప్రకటించాక మరింత అప్రతిష్ఠ పాలైందని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారదాహంతో ఇష్టారీతిన హామీలను గుప్పిస్తున్నదని, వాటిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని విమర్శించారు. ఆపద మొక్కులు తప్ప ఆ పార్టీ నేతలకు ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడూ పట్టవని తెలిపారు. గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులిచ్చి తెచ్చుకున్నారంటూ ఆరోపించిన రాజగోపాల్రెడ్డి, ఇప్పుడు అదే పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు.