హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం కవ్వాల్ టైగర్‌జోన్ పరిరక్షణ పేరుతో జారీ చేసిన జీవో 49.. గిరిజనులు, ఆదివాసీలకు జీవన్మరణ సమస్యగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తూ.. వారి పొట్ట కొడుతున్నాడని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బుధవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇతర నేతలతో కలిసి ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్‌ను, పెసా చట్టాన్ని ఉల్లంఘిస్తూ జీవో 49ను జారీ చేసిందని తెలిపారు. 7 పులల పరిరక్షణ పేరుతో 7 లక్షల మంది ఆదివాసీ, గిరిజన గూడేల ప్రజలను నిర్వాసితులను చేసే కుట్రతోనే జీవో తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివాసులు, గిరిజనుల భూములకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పట్టాలిస్తే.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఆ భూములను లాక్కుని, జనాలను తరిమికొడుతున్నారని నిప్పులుచెరిగారు.
ఆదివాసీల హక్కులను కాలరాసేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆదివాసులకు 4.5 లక్షల ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు, రైతుబంధు ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల జీవన విధానాలను గౌరవించడంలేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు తుంగబాలు, కేశవరావు, అభిలాశ్‌రావు, పూదరి సైదులు తదితరులు పాల్గొన్నారు.