హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి జనవరి 19వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చాయి. ఆదివారం హైదరాబాద్లో సీఐటీ యూ రాష్ట్ర అధ్యక్షుడు చుకా రాములు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ స మావేశం జరిగింది. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ మాట్లాడుతూ 23న విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా, 26న నల్లజెండాలు, బ్యాడ్జీలతో జిల్లాకేంద్రాల్లో నిరసనలు, జనవరి 1 నుంచి 19వరకు కళాజాతలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 11ఏండ్లుగా అత్యంత ప్రమాదకరమైన లేబర్కోడ్లను అమలుచేసి కార్మికుల హకులను కాలరాసిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఆమోదించిన ‘వికసిత్ భారత్-జీ రామ్ జీ’, విద్యుత్తు సవరణ చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ నాగయ్య, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాసర్, ఆర్ వెంకట్రాములు, ఎస్ వీరయ్య, రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, జే వెంకటేశ్, ఎస్ రమ పాల్గొన్నారు.