రాయపోల్ నవంబర్ 28 : చలిపులితో గ్రామాలు వణికి పోతున్నాయి. దీనికి తోడు తెల్లవారుజాము నుంచి పొగ మంచు(Fog) కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పొగ మంచు కమ్మి వేయడంతో వాహనదారులు లైట్లు వేసుకొని ముందుకు సాగారు. దట్టమైన పొగ మంచు ఏర్పడడంతో రోడ్డుపై వాహనాలకు ఎంతో ఇబ్బందిగా మారింది. రాయపోల్ మండల కేంద్రం నుంచి దౌల్తాబాద్ వరకు పొగ మంచు రావడంతో వాహనాలు ఎదురెదురు కనిపించకుండా పోయాయి. ఉదయం 5 గంటలకు రాయపోల్ నుంచి తిమ్మక్కపల్లి వరకు చాలామంది యువకులు మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారు.
అయితే పొగ మంచు వల్ల మార్నింగ్ వాకర్స్ కు కూడా ఇబ్బందిగా మారింది. వారు సెల్ ఫోన్ లైట్ ద్వారా మార్నింగ్ వాకింగ్ చేయడం కనిపించింది. పొగ మంచుతోపాటు చలి విపరీతంగా పెరగడంతో గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు చలితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చలి మంటలు కాపు కొని ఉపశమనం పొందుతున్నారు. రెండు, మూడు రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువ కావడంతో సాయంత్రం వేళలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. శుక్రవారం ఏర్పడిన పొగ మంచు వలన వాహనాదారులు. రైతులు ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
