Rabies | అనుమానం పెనుభూతమై ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. రేబిస్ సోకిందనే భయంతో ఓ మహిళ తన మూడేళ్ల కూతుర్ని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్పగుట్టలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన నరేశ్-యశోద (36) దంపతులు కొత్తగంజ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు అనురాగ్, అక్షర. ఇటీవల వాళ్ల ఇంటి ముందు ఆరబెట్టిన పల్లీలు, డ్రైఫ్రూట్స్‌ను వీధికుక్కలు ఎంగిలి చేశాయి. వాటిని అలాగే వంటల్లోల వాడినప్పటి నుంచి ఇంట్లో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో యశోద తీవ్రంగా భయపడిపోయింది. కుక్కలు ఎంగిలి చేసిన ఆహారం తినడం వల్ల రేబిస్ సోకి ఉంటుందేమోనని కలత చెందింది. ఈ క్రమంలో రేబిస్ టీకా తీసుకుందామని పట్టుబట్టడంతో ఇంట్లో వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇప్పించామని భర్త నరేశ్ తెలిపాడు. బంధువులు చెప్పారని నాటు మందులు సైతం వేసుకున్నామని పేర్కొన్నాడు. తాను ఆఫీసుకు వెళ్లాక రకరకాల పసరు మందులు కూడా తెప్పించుకుని తాగిందని వివరించాడు. రేబిస్ వ్యాధి గురించి యూట్యూబ్‌లోనూ వెతికిందని చెప్పాడు.
ఇదే సమయంలో యశోద చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడింది. దీంతో ఆమె మరింత మనోవేదనకు గురైంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం భర్త ఉద్యోగానికి వెళ్లగానే మూడేళ్ల కుమార్తెను చంపి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన అనంతరం ఇంటికి ఫోన్ చేస్తే.. కొడుకు అనురాగ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అమ్మ బెడ్రూంలోకి వెళ్లి డోర్ తీయడం లేదని చెప్పాడు. దీంతో భయపడిపోయిన నరేశ్.. పక్కింటి మహిళకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పక్కింటి మహిళ ఇంటికొచ్చి చూసేసరికి చనిపోయారు. కాగా, భర్త, కొడుకు మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని ఆత్మహత్య చేసుకునే ముందు యశోద గోడపై రాయడం గమనార్హం. యశోద తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.