ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 5: జీవితంపై విరక్తితో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను నీటిలోకి తోసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఈ క్రమంలో మరో బాబు త్రుటిలో తప్పించుకొన్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. రంగారెడ్డి జిల్లా మునగనూర్‌కు చెందిన ఒడుసు కుమార్ మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు. కొన్ని కారణాలతో ఆమె తన ఇద్దరు పిల్లలను కుమార్ వద్ద వదిలేసి విడాకులు తీసుకున్నది. ఆ తరువాత అతడు మంగను రెండో పెండ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. మొత్తం నలుగురు పిల్లలతో కలిసి వీరు వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. ఇతను వడ్డరి పనిచేస్తుంటాడు. ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.
దీంతో విసిగిపోయిన మంగ గురువారం సాయంత్రం పిల్లలు లావణ్య(14), శరత్(12)తోపాటు ఆరేండ్ల చరణ్‌ను స్కూల్ నుంచి తీసుకొని నేరుగా ఇబ్రహీంపట్నం చెరువు వద్దకు చేరుకున్నది. రాత్రి 7 గంటల సమయంలో చెరువులో స్నానం చేద్దామని చెప్పి మొదట ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసేసింది. ఆరేండ్ల బాలుడు చరణ్‌ను కూడా నీటిలోకి నెట్టడానికి ప్రయత్నించగా తప్పించుకుని పారి పోయాడు. మంగ కూడా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చరణ్ రోడ్డుపైకి వచ్చి అటుగా వెళ్లేవారికి చెప్పాడు. ఓ ఆటో డ్రైవర్ వారిని కాపాడటానికి చెరువు వద్దకు వెళ్లి చూడగా అప్పటికే మంగ, తన ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మంగ, శరత్ మృతదేహాలను బయటికి తీయగా లావణ్య మృతదేహం లభించలేదు. లావణ్య మొదటి భార్య బిడ్డకాగా, శరత్ సొంత కొడుకు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.