Tragedy | ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి ఓ కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో తల్లీ ఇద్దరు కూతుళ్లు దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా బావోజీతండాకు చెందిన బోడ ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజియోథెరపీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. భార్య కుమారి (27), కుమార్తెలు క్రితియన (3), కృషిక (2)తో హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. ప్రవీణ్ తల్లి ఈరి అనారోగ్యంతో ఉండటంతో 15 రోజుల కిందట భార్యాపిల్లలతో ప్రవీణ్ స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలోనే పిల్లల ఆధార్ కార్డులను అప్లై చేయడానికి మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా హర్య తండా సమీపంలోని టర్నింగ్ వద్ద కారుకు అడ్డంగా ఓ కుక్క వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. అప్పటికీ కారు అదుపు కాకపోవడంతో పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు నడుపుతున్న ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు హుటాహుటిన ప్రవీణ్‌ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ఒక్క ప్రమాదం కారణంగా కుటుంబం చిన్నాభిన్నం కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.