ఎల్లారెడ్డి రూరల్, మార్చి 30: కామారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొన్నది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం భిక్నూర్ పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్ అగ్రహారంలో చోటుచేసుకున్నది.
వెంకటాపూర్ అగ్రహారానికి చెందిన బొమ్మర్థి లింగయ్య (ఏసు) భార్య మౌనిక (25) శనివారం మధ్యాహ్నం పెద్ద చెరువు బ్యాక్వాటర్లో బట్టలు ఉతకడానికి.. పిల్లలు మైథిలి (10), అక్షర (9), వినయ్ (7)ని వెంట తీసుకెళ్లింది. మౌనిక బట్టలు ఉతుకుతుండగా, ముగ్గురు పిల్లలు స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. చెరువులో పూడిక తీయడం వల్ల లోతుగా గుంతలు ఉండటంతో పిల్లలు అందులో పడిపోయారు. గట్టిగా కేకలు వేయడంతో వారిని రక్షించడానికి నీటిలోకి దిగిన మౌనిక సైతం వారితోపాటు మునిగిపోయింది.
హమాలీ పనిచేసే లింగయ్య సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. భార్యా పిల్లలు కన్పించకపోవడంతో తన తండ్రి చిన్న లక్ష్మయ్యతో కలిసి గాలించారు. చివరికి చెరువు బ్యాక్ వాటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నలుగురికి సంబంధించిన దుస్తులు, చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని చెరువులో గాలించగా.. అర్ధరాత్రి సమయంలో మౌనిక, మైథిలి, వినయ్ మృతదేహాలు బయటపడ్డాయి. ఆదివారం ఉదయం అక్షర మృతదేహం లభ్యమైంది. లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బొజ్జ మహేశ్ తెలిపారు.