Tragedy |బిచ్కుంద(జుక్కల్), మే 10: ఉక్కపోతతో ఉపశమనం పొందడానికి ఏర్పాటు చేసుకున్న కూలర్ తల్లీకూతురి పాలిట మృత్యుపాశమైంది. నిద్రిస్తున్న సమయంలో కూలర్‌కు కాలు తగలడంతో విద్యుత్తుషాక్‌కు గురై మృతిచెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద గుల్లా తండాలో చోటుచేసుకున్నది.
జుక్కల్ ఎస్సై భువనేశ్వర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దగుల్లా తండాకు చెందిన శంకబాయి (34), ఆమె కూతురు శివాణి (14) శుక్రవారం రాత్రి కూలర్ పెట్టుకొని నిద్రించారు. కూలర్లో ఏదో సమస్య వచ్చి దానికి విద్యుత్తు సరఫరా కాగా.. నిద్రలో ఉన్న శివాణి ఎడమ కాలు కూలర్ నీటి తొట్టెలో పడింది. దీంతో విద్యుత్తు షాక్‌తో ఆమె కాలు పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. శివాణి పక్కనే నిద్రిస్తున్న తల్లి శంకబాయికి శివాణి ద్వారా విద్యుత్తు షాక్ తగిలి ఆమెకూడా మృతి చెందింది. ఇంటి బయట నిద్రించిన శంకబాయి కుమారుడు ప్రతిక్ శనివారం తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లీచెల్లెలు మృతిచెంది ఉండటంతో స్థానికులకు వెంటనే విషయం చెప్పాడు. తండావాసులు వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపివేయించారు. శంకబాయి భర్త డ్రైవర్‌గా పని చేయడంతో ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. మరో కూతురు బంధువుల వద్దకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు. తల్లీకూతురు మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.