హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ఎక్కువగా విద్యాశాఖలోనే ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. శుక్రవారం మన్నెగూడలో టీఎస్ యూటీఎఫ్ 5 వ రాష్ట్ర స్థాయి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో నోటిఫికేషన్లను జారిచేసిందని తెలిపారు. పాఠశాల విద్యలో ఖాళీల భర్తీ కూడా చేపడతామన్నారు.
కరోనా వల్ల విద్యా వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొన్నదని వివరించారు. ఆ సమయంలో డిజిటల్ విద్యా బోధనకు ఉపాధ్యాయులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. సమాజం లో మార్పు తెచ్చే శక్తి కేవలం ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని అన్నారు. అనేక సమయాలల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్,చుక్క రామయ్య సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్లామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
క్రమశిక్షణ గల సంఘంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయుల కోసం పనిచేయటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వ విప్ శైలజ టీచర్, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి ,ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి , జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి ,డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి , టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య ,ప్రధాన కార్యదర్శి చావ రవి గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వెంకటప్ప, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.