Congress | హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ఒకరికి తెలియకుండా ఒకరు.. పొద్దుపోయాక వెళ్లడం.. తెల్లారేకల్లా వచ్చేయడం.. ఇదీ ఇప్పు డు రాష్ట్రంలోని కొందరు అమాత్యుల ఢిల్లీ పర్యటనల తీరు. మంత్రి వర్గంలో మార్పులు చేర్పులుంటాయన్న ప్రచారం జరుగుతుండగా, మ రోవైపు దీనికి బలం చేకూరుస్తున్నట్టుగా మం త్రులు వరుసకట్టి ఢిల్లీ పర్యటనలకు వెళ్లి వస్తున్నారు. కీలక నేతలు కూడా హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరు, అధిష్ఠానం పెద్దలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి కలుస్తుండటంతో ఆసక్తి నెలకొన్నది. ఢిల్లీకి వెళ్లి వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
పార్టీ అధిష్ఠానం ఇన్ని రోజులు తెలంగాణపై సరిగ్గా దృష్టిపెట్టలేదు. దేశంలో వరుసగా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండడంతో ఆ హడావుడిలో పడి తెలంగాణ ప్రభుత్వం, పార్టీని పట్టించుకోలేదు. ఇప్పుడు కేరళలో పార్టీ గెలుపొందడం, అక్కడ పార్టీ పూర్తిస్థాయిలో కుదురుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతో పార్టీ పెద్దల పని అక్కడ ముగిసింది. ఆ తర్వాత కర్ణాటకపై దృష్టిసారించింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి మార్పు సహా మంత్రివర్గ కూర్పు అంశం ముగిసింది. దీంతోపాటు అక్కడ పార్టీ పదవుల అంశాన్ని కూడా తేల్చేశారు. వీటి తర్వాత దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ముఖ్యమైన రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరి 30 నెలలు గడిచాయి. ఈ నేపథ్యంలో పలు మార్పులు చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మంత్రిమండలిలో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఈ నెలలోనే భర్తీ చేయనున్నారనే ప్రచారం జరుగుతున్నది. భర్తీ చేయడానికి ఉన్న అవకాశాలు, ఎవరెవరిని ఎంపిక చేయాలన్నదానిపై సుదీర్ఘ చర్చ జరగుతున్నది. మరోవైపు ఉన్నవాళ్లను మార్చడం, శాఖల్లో మార్పులు చేయడంపై ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు తెలంగాణలో మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమందితో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలిసింది. గడిచిన 15-20 రోజులుగా సమావేశాల సంఖ్య పెరుగుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిశారు. వీరే కాకుండా మరో ముగ్గురు మంత్రులను కూడా అధిష్ఠానం ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడినట్టు తెలుస్తున్నది. వీరిలో కొందరు కర్ణాటకలో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వెళ్లినపుడు ప్రత్యేకంగా కలిశారని చెప్తున్నారు. అయితే.. ఎవరు కూడా తామెందుకు ఢిల్లీకి వెళ్లి వచ్చారో చెప్పడం లేదు. ఒకరిద్దరు మంత్రులు మాత్రం.. మంత్రివర్గం గురించి చర్చ జరిగిందని తమ సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. కానీ స్పష్టంగా అధిష్ఠానం ఎందుకు పిలిచిందో, ఏం మాట్లాడారో మాత్రం చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో భారీగా పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల భర్తీ జరుగుతుందని ప్రచారం జరుగుతున్నది. ఈసారి అసలు కాంగ్రెస్ నేతలకు పెద్దపీట వేయాలని, వలస నేతలకు పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వవద్దని అధిష్ఠానాన్ని కలిసినవారు చెప్పినట్టు సమాచారం.
ఢిల్లీకి వెళ్లి వస్తున్న కాంగ్రెస్ మంత్రులు, నేతలు, ఇతర ప్రముఖుల కదలికలపై ప్రభుత్వంలోని నిఘావర్గాలు దృష్టిసారించినట్టు తె లుస్తున్నది. ఎవరు వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడి ఉంటారన్నదానిపై ఎ ప్పటికప్పుడు నివేదికను తయారుచేసి ముఖ్యనేతకు పంపుతున్నట్టు చెప్తున్నారు. ఇటీవల ఒక మంత్రి ఎవ్వరికీ చెప్పకుండా ఢిల్లీకి వెళ్లారని, అక్కడ తెలంగాణ భవన్లో కాకుండా మరోచోట బస చేయడాన్ని కూడా నిఘావర్గాలు పసిగట్టినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. మొత్తంగా రహస్య పర్యటనల వెనుక లోగుట్టు ఏమిటో మంత్రులకు, ఢిల్లీ పెద్దలకు మాత్రమే తెలుసని చర్చించుకుంటున్నారు.