హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను టీజీపీస్సీ సోమవారం విడుదల చేసింది. పలువురు అభ్యర్థులు 900 మార్కులకు 500కు పైగా మార్కులు సాధించారు. ఓ అభ్యర్థి 570 మార్కులు సాధించగా, ఓ మహిళా అభ్యర్థికి 532.5 మార్కులొచ్చాయి. మరికొందరు 530, 512, 486 మార్కులు సాధించినట్టుగా తెలిసింది. టాపర్ల వివరాలను మాత్రం టీజీపీఎస్సీ వెల్లడించలేదు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా, 21వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కులను అభ్యర్థి లాగిన్ ఐడీలో మాత్రమే పొందుపరిచారు. టీజీపీఎస్సీ ఐడీ, మెయిన్స్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాల ద్వారా తెలుసుకునే చాన్స్ ఇచ్చారు.
అభ్యర్థులు సోమవారం నుంచి మార్చి 24 సాయంత్రం 5గంటల వరకు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో పేపర్‌కు రూ. వెయ్యి చొప్పున రీ కౌంటింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థుల మొత్తం మార్కులను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. జీఆర్‌ఎల్‌ను విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.