హైదరాబాద్, జూన్18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 352కు పైగా గురుకులాలు ఇన్చార్జుల పాలనలోనే కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎస్సీ గురుకుల సొసైటీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రిన్సిపాల్సే కాదు.. ఉన్నతస్థాయి పోస్టుల్లోనూ భారీగా ఖాళీలు ఉండగా, ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్న దుస్థితి నెలకొన్నది. దీంతో గురుకుల పాలన గాడి తప్పుతున్నది. సర్కార్ తీరుపై గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.
352 గురుకులాలకు వారే దిక్కు..
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ అన్ని కలిపి దాదాపు 1023కు పైగా గురుకులాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా గురుకులాలకు ప్రిన్సిపాల్స్ లేకుండా పోయారు. ప్రమోషన్లను కల్పించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్నది. ఎవరైనా ప్రిన్సిపాల్ ఉద్యోగ విరమణ పొందగానే వెంటనే అక్కడే ఉన్న మరొకరికి ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. మొత్తంగా 352గురుకులాల్లో ప్రస్తుతం ఇన్చార్జీ ప్రిన్సిపాల్స్ పాలనలోనే కొనసాగుతుండటం గమనార్హం. ఎస్సీ గురుకులాల్లో దాదాపు 150చోట్ల, బీసీ సొసైటీలో 70, మైనారిటీ సొసైటీలో 60, జనరల్ గురుకులాల్లో 22చోట్ల, ఎస్టీ గురుకులాల్లో 50చోట్ల రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ లేకుండా పోయారు. అవేకాదు డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, పీజీటీ స్థాయిలో భారీగా ఖాళీలున్నాయి.
ఎస్సీ గురుకుల సొసైటీలో మరీ అధ్వానం..
ఎస్సీ గురుకుల సొసైటీ చరిత్రలోనే ఓ టీచర్‌కు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉంటే సొసైటీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనే కీలక పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. అడిషనల్ సెక్రటరీ-1, జాయింట్ సెక్రటరీ-1, డిప్యూటీ సెక్రటరీ-3, ఫైనాన్స్ సెక్రటరీ-1, దాదాపు 150 ప్రిన్సిపాల్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నా సొసైటీ ఉన్నతాధికారులు డిప్యుటేషన్లపై పలువురికి కీలక స్థానాలను అప్పగించారు. సీనియారిటీతో సంబంధం లేకుండా, సొసైటీ సిబ్బందితోనే, అదీ డిప్యుటేషన్‌పై ప్రధాన కార్యాలయంలో ఏండ్లకు ఏండ్లుగా అక్రమమార్గంలో తిష్ట వేసిన వారితోనే భర్తీ చేయడం గమనార్హం. సొసైటీలో అత్యంత కీలకమైన అకాడమిక్ జేఎస్ (జాయింట్ సెక్రటరీ), డీఎస్(డిప్యూటీ సెక్రటరీ) పోస్టులను సైతం అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్‌తోనే కొనసాగిస్తున్నారు. దీంతో గురుకులాల్లో పాలన గాడి తప్పింది.
తక్షణం ప్రమోషన్లు కల్పించాలి: టిగారియా
ఎస్సీ గురుకుల సొసైటీలో ఖాళీ పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఉద్యోగుల సంఘం (టిగారియా) రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులుగౌడ్ డిమాండ్ చేశారు. సొసైటీలోని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాన్ని గురువారం సమర్పించారు. అనంతరం సంఘం నేతలు గణేశ్, జనార్దన్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీలో జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, జోనల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్ గ్రేడ్-1, ప్రిన్సిపాల్స్ గ్రేడ్-2 పోస్టులు భారీసంఖ్యలో ఖాళీగా ఉన్నాయని వివరించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో వీటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు.