Group-1 Mains | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘గ్రూప్ 1పై 14కు పైగా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. పరీక్షల అనంతరం కోర్టు తీర్పులొస్తే ఎలా అమలు చేస్తారు. అందుకే తీర్పుల అనంతరమే పరీక్షలు నిర్వహించాలి’ అని అభ్యర్థులు కోరుతున్నారు. కేసులు కొలిక్కి వచ్చేవరకు పరీక్షలను నిర్వహించొద్దని కోరుతున్నారు. ఈ అంశంపై శుక్రవారం అభ్యర్థులు ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సంతకాలు సేకరించి హైకోర్టు చీఫ్ జస్టీస్ అలోక్ అరాధేకు విన్నవించుకోవాలని అభ్యర్థులు నిర్ణయించారు. గ్రూప్-1పై పెండింగ్లో ఉన్న కేసులు హైకోర్టు ధర్మాసనం ముందు విచారణ జరుగుతుండగా పరీక్షలెలా నిర్వహిస్తారని అభ్యర్థులు అభ్యంతరం తెలుపుతున్నారు.
ఒకవేళ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత తీర్పులొస్తే అమలు ఎలా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 9న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అర్హత సాధించారు. వీరికి అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించాల్సి ఉన్నది. గ్రూప్-1పై ప్రస్తుతం పలు కేసులు హైకోర్టులో విచారణ జరుగుతున్నాయి. హారిజాంటల్ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్ నవంబర్ 7న, ఫైనల్ కీపై, జీవో-29పై వేసిన కేసులు ఈ నెల 27 విచారణకు రానున్నాయి. స్థానికతపై వేసిన పిటిషన్ కేసు అక్టోబర్ 3న విచారణకు రానున్నది. ఆయా కేసులు తేలాకే మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలన్నది అభ్యర్థుల ప్రధాన డిమాండ్.