Telangana | హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే వచ్చినట్టు తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ నిజామాబాద్ ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొన్నది.
ప్రస్తుతం మహబూబ్ నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ మధ్యలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం (ఈనెల 27న) ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని, 29లోగా బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నది. దీంతో 27,28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
సోమవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నాగర్ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. యాదాద్రి-భువనగిరి జిల్లా రాజాపేటలో 4.26 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో 3.61 సెం.మీ, నారాయణపేట జిల్లా మరికల్లో 3.47 సెం.మీ, మక్తల్‌లో 3.05 సెం.మీ, కృష్ణలో 2.76 సెం.మీ, ధన్వాడలో 2.66 సెం.మీ, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 3.13 సెం.మీ, హన్వాడలో 3.40 సెం.మీ, దేవరకద్రలో 2.58 సెం.మీ, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో 3.32 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది. పిడుగులూ పడుతాయని హెచ్చరించింది.