పాలకుర్తి (జనగామ) : ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపెడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli) ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ఢిల్లీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వావిలాల, ముత్తారం గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్(Brs) ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఎర్రబెల్లి దంపతులు నృత్యం చేశారు.
ఆయన మాట్లాడుతూ బీజేపీ(Bjp)కి కాంగ్రెస్ పార్టీ వంత పాడుతోందని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో ప్రతి ఇంటా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని వెల్లడించారు. ‘ కన్న కొడుకు వలె కంటి అద్దాలను పెట్టించిండు. పెద్ద కొడుకు లాగా ఆసరా పింఛన్ ఇచ్చిండు. మేనమామ వలె కల్యాణలక్ష్మి(Kalyana Laxmi) ఇచ్చిండు.. పెద్దన్నలాగా రైతాంగానికి రైతు బంధు పంపిండని ’ అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రైతుల బాయిల కాడ మోటర్లకు మీటర్లు పెట్టకే పోతే రూ.30వేల కోట్లు ఆపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేస్తున్నాడన్నారు.
కేంద్రం అవార్డులు ఇవ్వడమే తప్ప రూపాయి నిధులు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్ కోటిరెడ్డి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ మోహన్ గాంధీనాయక్, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూ రి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, దేవస్థానం చైర్మన్ వీ రాంచంద్రయ్య శర్మ, పాలకుర్తి వ్యవసాయ మార్కె ట్ చైర్మన్ ముస్కు రాంబాబు, సర్పంచ్‌లు గంట పద్మాభాస్కర్, కల్వల భాస్కర్‌రెడ్డి, నల్లపు మౌనికాఅశోక్, భూమ రంగయ్య పాల్గొన్నారు.