హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం మల్కాజిగిరిలో రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ వరకు ఆయన గంటపాటు రోడ్‌షో చేపట్టారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి ఈటల వెంట ఉన్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకున్న మోదీ అక్కడే రాత్రి బస చేశారు. శనివారం నాగర్‌కర్నూల్‌కు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ చౌరస్తాలో జరిగే విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నాగర్‌కర్నూల్‌కు చేరుకొని ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు బహిరంగ సభలో పీఎం ప్రసంగించనున్నారు. అనంతరం ఒంటిగంటకు అక్కడి నుంచి కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లనున్నారు.