CM KCR | ఇవాళ పెడబొబ్బలు పెట్టే మూడు రంగుల జెండాలు, ఎర్రెర్ర జెండాలు, పచ్చరంగుల జెండాలు దళితులకు ఏం జేసినై? గుండెమీద చెయ్యేసి ఆత్మవిమర్శ చేసుకోవాలె. ఏ జెండా ఏం చేయలె.. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నరు. ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకున్నది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వేలు అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. చివరికి ఈ దేశాన్ని ఏం చేస్తారో!
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): దేశంలో దళితులపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీదే బాధ్యత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో దళితుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని, బీజేపీ, కాం గ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనే అధికంగా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా దళితులపై పాశవిక దాడు లు, వివక్ష కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్లో చాలా భయంకమై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘ఈ వివక్ష ఏంది? ఈ దురాగతం ఏంది? ఇది ప్రజాస్వామ్య దేశమా? అరాచకమా?’ అని ప్రశ్నించారు. సత్తుపల్లి, ఇల్లందులో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. దశాబ్దాలుగా దళితులను బీజేపీ, కాంగ్రెస్ ఓటుబ్యాంకుగానే వాడుకొన్నాయని విమర్శించారు. తెలంగాణలో మాత్రమే దళితుల అభ్యున్నతి కొనసాగుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందని, పైరవీకార్లు బయలుదేరతారని, భూములపై రైతుల అధికారం పోయి అధికారులు, నాయకుల పెత్తనం వస్తుందని హెచ్చరించ్చారు. ఓటు వేసే ముందు ఆలోచించాలని సూచించారు. ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదని, పార్టీల మధ్యనే పోరాటమని, మంచి ప్రభుత్వం వస్తేనే మంచి పనులు జరుగుతాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నదే తప్ప ఎన్నడూ వారి శ్రేయస్సును పట్టించుకోలేదని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో కండ్ల ముందు ఉన్నదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సత్తుపల్లి, ఇల్లందులు చాలా చైతన్యం, ఆలోచన శక్తి ఉన్న ప్రాంతాలని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటా యి. ఎవరు వద్దన్నా, కాదన్నా ఎవరో ఒకరు గెలుస్తుంటారు. కానీ, పోటీ చేసే వ్యక్తుల చరి త్ర, కార్యదక్షత, అనుభవం ఏందనేది చూడా లి. అంతకు మించి వారి వెనుక ఏ పార్టీ ఉన్న ది? దాని చరిత్ర ఏమిటి? వైఖరి ఏమిటి? దృ క్పథం ఏమిటి? ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నది అనేది ఆలోచించాలి. ఎవరో చెప్పార ని, కులం చూసి కాకుండా, నిజానిజాలు గుర్తించి, ఆలోచించి ఓటేయాలి’ అని కోరారు.
ఎంత అహంకారం! రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని, నేను కూడా ఆనని అంత అహంకారమా? నాలుగు పైసలు జేబులోకి రాగానే ఇంత అహంకారమా? ఇంత మదమా? ఖమ్మం జిల్లా దీనిని సహిస్తదా? డబ్బు రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతయో ఆలోచించాలె. ఫాల్తుగాళ్లు. పనికిమాలిన వాళ్లు. అహంకారపూరితంగా మాట్లాడేవాళ్లు ఉన్నంతకాలం దేశం బాగుపడదు. గడియారాలు పంచుడు. పైసలు పంచుడు, మందుగుండు సామగ్రి దించుడు. ఇదా రాజకీయం? నువ్విచ్చే రూ.60-70 గడియారం చూసి మా బతుకు అమ్మాలా?
– సీఎం కేసీఆర్
గతంలో ఎవరు అధికారంలో ఉన్నా దళితులను ఓటుబ్యాంకుగానే వాడుకొన్నారని, బీఆర్ఎస్ మాత్రమే వారి అభ్యున్నతి కోసం నిజాయితీగా పనిచేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నా రు. ‘ఇవాళ పెడబొబ్బలు పెట్టే మూడు రంగుల జెండాలు, ఎర్రెర్ర జెండాలు, పచ్చరంగుల జెం డాలు ఏం జేసినై? గుండెమీద చెయ్యేసి ఆత్మవిమర్శ చేసుకోవాలె. దళితులను ఓటు బ్యాం కుగా వాడుకున్నరు తప్ప ఏ జెండా ఏం చేయ లె. మనుషులుగా గుర్తించలె. ఇయ్యాల కూడా ఉత్తరభారతదేశంలో దళితుల మీద దాడులు చేయని రోజు లేదు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో చాలా భయంకమై దాడులు జరుగుతున్నాయి. ఈ వివక్ష ఏంది? ఈ దురాగతం ఏంది? ఇది ప్రజాస్వామ్య దేశమా? అరాచకమా? దీన్నంతా ఆలోచించి నేను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ రోజు దళితబంధుకు కూడా అదే స్ఫూర్తి. రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టాం. ఓట్ల కోసమే అయితే ఎప్పుడో పెట్టేవాళ్లం. పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రంలో ఎన్నికలే లేవు. సంకుచితంగా ఎప్పుడూ ఆలోచించలేదు. బీఆర్ఎస్ పార్టీ పనితీరుకు అదే గీ టురాయి. సత్తుపల్లి నియోజకవర్గం మొత్తానికి దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తాం. ఎన్నికలు పూర్తికాగానే దీనిని అమలుచేస్తాం. దళిత సమా జం వికాసాన్ని మనసునిండా కోరుకునేది బీఆర్ఎస్ ఒక్కటే. ఆ పార్టీని పోగొట్టుకోవద్దు. బీఆర్ఎస్ను అధికారంలో కొనసాగించే బాధ్యత ద ళిత సమాజానిదే’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
కరెంటు మూడు గంటలు ఇస్తే సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు అంటున్నాడు. మాట్లాడితే కొంచెంత ఇజ్జత్, శరం ఉండాలి. మూడు గంటల కరెంటు సరిపోతదా? 24 గంటలు కావాలో ప్రజలే నిర్ణయించాలి. ధరణి ఉంది కాబట్టే రైతుబంధు, రైతు బీమా డబ్బులు వస్తున్నాయి. కాంగ్రెస్ ధరణిని బంద్ చేస్తామని ప్రకటిస్తున్నది. మరి దాని ప్రత్యామ్నాయం ఏమిటి? మళ్లీ కార్యాలయాల వెంట తిరగాలా?
– సీఎం కేసీఆర్
వెంకట వీరయ్య గెలుపు వందశాతం తథ్యమని, సత్తుపల్లి నియోజకవర్గంలో 70-80 వేల మెజార్టీతో గెలుస్తారని, అందుకు సభకు తరలివచ్చిన ప్రజలే నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఏ ఊరి నుంచి ఫోన్ వచ్చినా వెంకటవీరయ్య వెంటనే పక్షిలాగ వాలిపోతాడు. ఆపద్బంధు, అంబులెన్స్ ఆలస్యమైతదేమో కాని, వీరయ్య ఆల్యసం కాడు. వీరయ్య చేసిన అభివృద్ధి గురించి చెప్పాల్సిన పని లేదు. మనం ఎవరితో విడిపోయామో వాళ్ల సరిహద్దులోనే సత్తుపల్లి ఉన్నది. వాళ్ల రోడ్లు, మన రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తే చాలు.. తేడా తెలుస్తుంది. నేను చెప్తే అది శిలాక్షరం. పోలింగ్ మరునాటి నుంచే సత్తుపల్లిలో దళితబంధు అమలవుతుంది. నేనే స్వయంగా వచ్చి అమలు చేయిస్తా. సీతారామ ప్రాజెక్టు నా ప్రాణం.. గుండెకాయలాంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పాత ఖమ్మం జిల్లా వరప్రదాయిని. ఖమ్మం జిల్లాకు కరువనేది రాదు. కన్నూర్, తల్లాడలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేస్తాం. వేంసూర్ మండలానికి చెందిన పారిశ్రామికవేత్త పార్థసారథిరెడ్డి ఎంతో మంది పిల్లలకు విద్యనందిస్తున్నారు. వీరయ్య చాలా సీనియర్ నాయకుడు. ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించి సత్తుపల్లి సత్తా చాటాలి’ అని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్రమోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వేలు తదితర అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారని, చివరికి ఈ దేశాన్ని ఏం చేస్తారో తెలియదని ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్‌పరం చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో పెడుతున్నదని వివరించారు. జెన్కో ఆధ్వర్యంలో పెట్టిన భధ్రాద్రి, దామరచర్ల విద్యుత్తు ప్లాంట్లను ఉదహరించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెచ్చినా, రూ.25 వేల కోట్ల నష్టాన్ని భరించాం కానీ కేంద్రానికి తలొగ్గలేదని తెలిపారు. రైతుబంధు ఏటా ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో రూ.16 వేలకు పెంచుతామని చెప్పారు. ‘నేడు డబుల్ రోడ్డు వచ్చిందం టే తెలంగాణ, సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్ర అని ప్రజలు భావించే పరిస్థితి ఉన్నది. మనం ఎలా బతుకుతామోనని ఏపీవాళ్లు బాధపడ్డారు. కానీ వాళ్లే నేడు ఇక్కడికి వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారు. వ్యవసాయ స్థిరీకరణ అవుతున్నది. అయినా ఎన్నికల కోసం పథకాలు పెట్టామని బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఎన్నికల కోసమే పెట్టామా? సీతారామ ప్రాజెక్టు ఎన్నికల కోసమే పెట్టామా? బలుపు రాజకీయాలు చేసేవారు ఎప్పుడైనా అవి ఆలోచించారా?’ అంటూ నిప్పులు చెరిగారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ఏ విధంగా పల్లెలు, పట్టణాలు బాగుపడ్డాయో అందరికీ తెలుసని అన్నీ కండ్ల ముందే ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకున్నది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వేలు తదితర అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. చివరికి ఈ దేశాన్ని ఏం చేస్తారో!
– సీఎం కేసీఆర్
ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు డబ్బున్నవాళ్లు బీఆర్ఎస్ అభ్యర్థులను వాకిలి తొక్కనియ్యబోమని హూంకరిస్తున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రజలు తలచుకుంటే దుమ్మురేగుతుందని అన్నారు. పహిల్వాన్లాగా సత్తుపల్లి నుంచి నాలుగోసారి సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వర్రావు జయకేతనం ఎగురవేస్తారని తేల్చిచెప్పారు. ‘ఎంత అహంకారం! రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని, నేను కూడా ఆనని అంత అహంకారమా? నాలుగు పైసలు జేబులోకి రాగానే ఇంత అహంకారమా? ఇంత మదమా? ఖమ్మం జిల్లా దీనిని సహిస్తదా? డబ్బు రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతయో ఆలోచించాలె. ఫాల్తుగాళ్లు. పనికిమాలిన వాళ్లు. అహంకారపూరితంగా మాట్లాడేవాళ్లు ఉన్నంతకాలం దేశం బాగుపడదు. గడియారాలు పంచుడు. పైసలు పంచుడు, మందుగుండు సామగ్రి దించుడు. ఇదా రాజకీయం? నువ్విచ్చే రూ.60-70 గడియారం చూసి మా బతుకు అమ్మాలా? నీళ్లు, కరెంటు, దళితబంధు, రైతుబంధు కావాలా? ఇలాంటి నీచులు కావాలా?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
ఇల్లందు పోరాటాల పురిటిగడ్డ, చైతన్యవంతమైన ప్రాంతమని, ఎన్నికల్లో పరిణతి ప్రదర్శించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇల్లం దు నియోజకవర్గంలో 15,107 గిరిజన రైతు కుటుంబాలకు 48,300 ఎకరాల పోడు భూ ములను పంచామని, హరిప్రియ హయాం లో ఇంతపెద్ద ఎత్తున పోడుభూములను అందించడంతోపాటు వాటిపై ఉన్న పోలీసు కేసులు రద్దుచేసి, రైతుబంధు, త్రీఫేజ్ కరెం టు కూడా ఇస్తున్నామని వివరించారు. ఇప్పుడు హరిప్రియ నాయకత్వంలో రూ.100 కోట్లతో గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేసుకున్నామని, ఇల్లందు పట్టణంలో కూడా రూ.350-400 కోట్లతో లైట్లు, సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. హరిప్రియను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎవరు వద్దన్నా, కాదన్నా ఎవరో ఒకరు గెలుస్తుంటారు. కానీ పోటీ చేసే వ్యక్తుల చరిత్ర, కార్యదక్షత, అనుభవం ఏందనేది చూడాలి. అంతకు మించి వారి వెనుక ఏ పార్టీ ఉన్నది? దాని చరిత్ర ఏమిటి? వైఖరి ఏమిటి? దృక్పథం ఏమిటి? ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నది అనేది ఆలోచించాలి. ఎవరో చెప్పారని, కులం చూసి కాకుండా, నిజానిజాలు గుర్తించి, ఆలోచించి ఓటేయాలి.
– సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన వాటికన్నా, చెప్పని పథకాలనే ఎక్కువగా అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ వివరించారు. మేధావులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ప్రజలకు ఏది అవసరమో అది అమలు చేస్తున్నామని, పది ఓట్లు రావాలని, ఈ పూట గడవాలని, ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతో కాదని స్పష్టంచేశారు. ‘మేం తెలంగాణ తెచ్చినవాళ్లం. ఎట్లన్న బాగుచేయాలనే బాధ్యతతో పనిచేస్తున్నాం. తెలంగాణ వచ్చిన నాడు కరెంటు లేదు, తాగు నీళ్లు లేవు, సాగునీళ్లు లేవు. ఏడ్చినా మనల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణను చక్కదిద్దాలనే అంశంపై మూడు నాలుగు నెలలు మేధోమథనం సాగించి ఒక దారి వేసుకున్నాం. ఆసరా పింఛన్లను మొదట రూ.వెయ్యితో ప్రారంభించి రూ.2 వేలు చేశాం. కల్యాణలక్ష్మిని రూ.50 వేలతో ప్రారంభించి రూ.లక్ష చేసుకున్నాం. రాష్ట్ర ఆదాయం పెరుగుతున్న తీరుగానే సంక్షేమ కార్యక్రమాలను పెంచుకుంటూ ముందుకు పోతున్నాం’ అని వివరించారు.
పదేండ్ల నుంచి మంచి వర్షాలతో పంటలు బాగా పండుతుండటంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా వడ్ల కల్లాలు కనిపిస్తున్నాయని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ నేడు ఏటా మూడు కోట్ల టన్నుల వరిధాన్యం పండిస్తున్నదని, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే నాలుగు కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని తెలిపారు. లక్ష్మీదేవి కటాక్షం ఉన్న మన తెలంగాణలో 93 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, వారందరికీ వచ్చే మార్చి నుంచి సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. పెన్షన్లను కూడా రూ.5000లకు పెంచుతామని, అర్హులైన మహిళలకు నె లకు రూ.3000 ఇస్తామని, గ్యాస్ సిలిండర్ రూ.400కే ఇస్తామని హామీ ఇచ్చా రు. రైతు బీమా కింద ఇప్పటికే లక్ష కు టుంబాలకు సహాయం అందిందని, అ దే తరహాలో 93 లక్షల రేషన్ కార్డుదారులకు బీమా చేయిస్తామని వెల్లడించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏండ్లకుపైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం మేలు చేసిందో, పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలు బేరీజు వేసి చూడాలని సీఎం కేసీఆర్ కోరారు. ‘ఎవరో వచ్చి చెప్పాల్సిన పనిలేదు. చెప్పినా ప్రజలు గోల్మాల్ కారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రైతుబంధు దుబారా అంటున్నారు. దుబారా అనేటోళ్లను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలి. కరెంటు మూడు గంటలు ఇస్తే సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు అంటున్నాడు. మాట్లాడితే కొంచెంత ఇజ్జత్, శరం ఉండాలి. మూడు గంటల కరెంటు సరిపోతదా? 24 గంటలు కావాలో ప్రజలే నిర్ణయించాలి. ధరణి ఉంది కాబట్టే రైతుబంధు, రైతు బీమా డబ్బులు వస్తున్నాయి. కాంగ్రెస్ ధరణిని బంద్ చేస్తామని ప్రకటిస్తున్నది. మరి దాని ప్రత్యామ్నాయం ఏమిటి? మళ్లీ కార్యాలయాల వెంట తిరగాలా? కాంగ్రెస్‌కు ఓటే దళారుల రాజ్యమే వస్తది. బీఆర్ఎస్కు ఓటేస్తే భూమిపై రైతుల పెత్తనమే ఉంటది. మళ్లీ పైరవీకార్ల రాజ్యాన్ని తెచ్చుకుందామా? ఏది మంచో ఆలోచన చేయాలి. కూరగాయలు కొనెటప్పుడు పుచ్చులను ఏరేసిన రీతిలో.. కుండను కొన్నప్పుడు వేళ్లతో కొట్టి పగుళ్లను చూసిన రీతిలో ఓటేసే ముందు కూడా విచక్షణతో వ్యవహరించాలి’ అని సూచించారు.
ఏజెన్సీలో పోడు భూములకు పట్టాలిచ్చిన మహానేత సీఎం కేసీఆర్ అని ఇల్లందు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియానాయక్ కొనియాడారు. గిరిజనులను పోడు భూములకు యజమానులను చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఇల్లందు నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు జరిగాయని, సంక్షేమ పథకాలు అమలయ్యాయని వివరించారు. కేవలం అభివృద్ధి పనులకే రూ.3001.19 కోట్లు వెచ్చించినట్టు చెప్పారు. నియోజకవర్గంలో విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుపరిచిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.
సీఎం కేసీఆర్ సంక్షేమ రాజ్య సృష్టికర్తగా ప్రజల మనసుల్లో నిలిచిపోతారని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో బుధవారం ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. మూడుసార్లు సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని వివరించారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.1,000 కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. దళితబంధు పథకంలో ఎస్సీల ఆర్థిక స్థితిగతులను మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 30 వేల ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇచ్చేందుకు సర్వే కూడా పూర్తయిందని తెలిపారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను, నాలుగోసారి ఎమ్మెల్యేగా తనను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.