మోర్తాడ్, మార్చి 10: వ్యాపారుల సిండికేట్ కారణంగా ఎర్రజొన్న ధర పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారం క్రితం క్వింటాకు రూ.3,850 ఉన్న ధరను రూ.3,450కి తగ్గించారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరారు. ఎర్రజొన్న ధర తగ్గిస్తున్న తరుణంలో స్పందించిన వేముల.. సోమవారం కలెక్టర్‌కు ఫోన్‌చేసి పరిస్థితిని వివరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వ్యాపారుల సిండికేట్‌ను అరికట్టాలని కోరారు. రైతులను నష్టపరిచే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని స్పష్టంచేశారు. ప్రభుత్వం, కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని రైతులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సాగు విస్తీర్ణంతోపాటు పంట దిగుబడి తగ్గిన నేపథ్యంలో సహజంగానే ధర పెరగాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా తగ్గుతుండటంపై వేమల ఆందోళన వ్యక్తంచేశారు. వ్యాపారులు కృత్రిమంగా ధరలు తగ్గించే ప్రయత్నాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎర్రజొన్న ప్రధానంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘ్ఘనిస్థాన్తోపాటు ఉత్తర భారతదేశానికి ఎగుమతి అవుతుందని, అక్కడ ఎలాంటి యుద్ధ పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని క్వింటాల్‌కు కనీసం రూ.4వేలు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.