రామన్నపేట, మార్చి 10: అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39) చేనేత పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చేనేత పని గురించి ఐదేండ్ల క్రితం భువనగిరిలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ.3.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. రెండు నెలలుగా చేనేత పనులులేక ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐలు కట్టలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాలరాజు మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగరాజు తెలిపారు. విషయం తెలుసుకున్న బాలరాజు మృతదేహానికి బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. బాధి త కుటుంబానికి రూ.15వేల ఆర్థిక సాయం అందించారు.