‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుగా.. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం భారత్‌ను ప్రభావితం చేస్తున్నది.
ఇప్పటికే ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ దిగుమతుల్లేక అల్లాడిపోతుంటే.. వంటనూనెల సరఫరాను కూడా మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు దెబ్బతీస్తున్నాయి.
ఇక పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం.. ఇంకా ముదిరితే భారత్‌కు భారీ నష్టాలేనన్న అంచనాలు మొదలయ్యాయి. అన్ని రకాల చమురు అవసరాలకు విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తున్నది మరి.
న్యూఢిల్లీ, మార్చి 10 : వాహనాల ఇంధన సమస్యతో సతమతమవుతున్న భారత్‌కు.. వంటనూనెల తలనొప్పి మొదలైందిప్పుడు. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ దాడులు, ప్రతిదాడుల ప్రభావం కేవలం ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరానేగాక.. సోయా, సన్‌ఫ్లవర్ పామాయిల్ దిగుమతులపైనా కనిపిస్తున్నది మరి. ప్రస్తుతం దేశీయ వంటనూనెల అవసరాలు మూడింటా దాదాపు రెండు వంతులు (66 శాతం) దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇక దేశ, విదేశీ విపణులలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా రిటైల్ మార్కెట్లో వంటనూనెల ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. దీంతో సహజంగానే కొనుగోలు పెరుగుతున్నది. ఫలితంగా డిమాండ్‌కు తగ్గ సరఫరా కోసం వ్యాపారులు విదేశాల నుంచి మరింతగా వంటనూనెల్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. అయితే అసలే భారమైన సరుకు రవాణా ఖర్చుల నడుమ కొత్తగా కొంటున్న వంటనూనెలు సకాలంలో చేతికందక డీలర్లు అవస్థలు పడాల్సి వస్తున్నది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో కార్గో షిప్‌ల రాకపోకలు అంతంతమాత్రంగా సాగుతున్నాయి. నడుస్తున్న ఆ కొద్ది నౌకలూ చుట్టూ తిరిగి వస్తుండటంతో ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయి.
ప్రపంచంలోనే వంటనూనెల దిగుమతిలో భారత్ అగ్రగామిగా ఉన్నది. అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయానూనెను దేశీయ దిగుమతిదారులు ప్రధానంగా కొంటున్నారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ పెద్ద మొత్తంలో భారత్‌కు వస్తున్నది. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియాల నుంచి పామాయిల్‌ను కొంటున్నాం. అయితే సాధారణంగా అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి భారత్‌కు సముద్ర మార్గం ద్వారా వంటనూనెల దిగుమతులు రావాలంటే 6 వారాలపైనే పడుతుంది. రష్యా, ఉక్రెయిన్ల నుంచి నల్ల సముద్రం మీదుగా సరుకు చేరాలంటే 3-4 వారాల సమయం తీసుకుంటున్నది. ఇక ఆసియా దేశాల నుంచే పామాయిల్ దిగుమతులు అవుతున్నా ఇంచుమించుగా వారం సమయం అవుతున్నది. కానీ గల్ఫ్ దేశాలు అగ్ని గుండంలా మారడంతో ఈ వంటనూనెల దిగుమతి ఆలస్యమవుతున్నదిప్పుడు. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ల నుంచి ఎర్ర సముద్రం మీదుగా భారత్‌కు రావాల్సిన సన్‌ఫ్లవర్ ఆయిల్.. ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తున్నది. అమెరికాకు అండగా ఉంటున్నారని పొరుగు దేశాలే లక్ష్యంగా ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తున్నది. తమ భూభాగంలోని హొర్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. ఈ మార్గంలో వెళ్లే నౌకలపై దాడులు చేస్తున్నది. దీంతో దూరమైనా సురక్షిత మార్గాల్లోనే నౌకలు వెళ్లాల్సి వస్తున్నది. ఫలితంగా నౌకల ఇంధన ఖర్చుతోపాటు సరుకులపై బీమా వ్యయం కూడా పెరిగిపోతున్నది. అలాగే సరుకు కనీసం 10 రోజులు ఆలస్యంగా వస్తుండటంతో వ్యాపారులపై టన్నుకు 20 డాలర్లు, ఆపై భారం పడుతున్నది. తెచ్చిన వాణిజ్య రుణాలకు వడ్డీ భారం కూడా పెరిగిపోతున్నది.
పశ్చిమాసియా సంక్షోభం.. భారత్‌లో ద్రవ్యోల్బణ భయాలకు దారితీస్తున్నది. ఇప్పటికే వంటగ్యాస్ ధర సిలిండర్‌కు రూ.60 పెరిగింది. త్వరలో పెట్రోల్, డీజిల్‌తోపాటు ఇతర ఇంధన ధరలూ పెరుగుతాయన్న అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక వంటనూనెల ధరలూ విజృంభిస్తున్నాయి. దీంతో అటు రిటైల్, ఇటు హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈసారి భారీగానే నమోదు కావచ్చన్న విశ్లేషణలైతే ఉన్నాయి. ఇదే జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను పెంచే వీలుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరిగి రుణ లభ్యత భారం కావచ్చని, ఇది ఆయా రంగాల వృద్ధిని దెబ్బతీయగలదన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయిప్పుడు. చివరకు దేశ జీడీపీ వృద్ధి క్షీణించే ప్రమాదం ఉందని అంటున్నారు. దీంతో ఇప్పటికైనా మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు తగ్గేలా మోదీ సర్కార్ చొరవ చూపాల్సిన అవసరం ఉందని, లేకపోతే భారత ఆర్థిక లక్ష్యాలకు ముప్పేనని హెచ్చరిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకోవడం మానేసి.. ఇంధన సమస్య తీవ్రరూపం దాల్చకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఇప్పటికే వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్లు లేక దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. దీంతో పరిస్థితి ఇలాగే ఉంటే చాలామంది ఉపాధికి దూరం కావాల్సి వస్తుందని కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.