బీజేపీ పుణ్యాత్ములు అంతపనీ చేసే ప్రమాదం కనిపిస్తున్నది
మనం ఆదమరిస్తే అస్తిత్వం కోల్పోవడం ఖాయం: హరీశ్
వరంగల్, ఫిబ్రవరి 10 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఏ మాత్రం ఆదమరచి ఉన్నా.. తెలంగాణ అస్తిత్వం కోల్పోవడం ఖాయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీ పుణ్యాత్ములు తెలంగాణను ఏపీలో కలిపినా కలుపుతరన్న ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచిన ప్రధాని మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. గురువారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలను కించపరిచారని విమర్శించారు. తెలంగాణపై ఎప్పుడూ విషం చిమ్మడమే మోదీ పని మండిపడ్డారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో సహా తెలంగాణకు ఏ ఒక్క సంస్థనూ కేంద్రం ఇవ్వలేదని గుర్తుచేశారు. సంసద్ గ్రామ్ యోజన స్కీంలో టాప్ 10 గ్రామాల్లో ఏడు తెలంగాణవే ఉండటం తమ పనితీరుకు నిదర్శనమని.. ఇదీ వారి కండ్లకు కనిపిస్తలేదని చెప్పారు. కేంద్ర రాష్ర్టాలు కలిసి ఉండాలని నీతులు చెప్పే మోదీ.. మా ఏడు మండలాలను, లోయర్ సీలేరు ప్రాజెక్టును.. తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఏపీకి ఎలా అప్పగించారని నిలదీశారు. 60 ఏండ్ల ఆకాంక్షలకు ఫలంగా సాధించుకొన్న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ తప్పుగా కనపడటానికి బీజేపీ కడుపునిండా విషం ఉండటం వల్లేనని మండిపడ్డారు. ‘మీకు తెలంగాణలో నూకలు చెల్లినయి. నిధులు ఇవ్వరు. సూటిపోటి మాటలు అంటరు. అమరుల త్యాగాలను తకువ చేస్తరు. మీరు ఎన్నిచేసినా రాష్ట్రం పురోగతిలో ఉంటది. అభివృద్ధి ఆగదు’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
రాష్ర్టాన్ని అభినందించాల్సింది పోయి..
కొవిడ్ సమయంలో పనులులేక కష్టాలు పడుతున్న వలస కార్మికులను ఉచితంగా టికెట్లు ఇచ్చి స్వస్థలాలకు పంపిస్తే రాష్ర్టాలను అభినందించాల్సిన ప్రధాని వారిపైనా విషం కక్కారని హరీశ్ఆగ్రహించారు. అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటిస్తే వలసకార్మికులు నరకం అనుభవించారని, ఆ సమయంలో సీఎం కేసీఆర్ భోజనం పెట్టి, జేబులో డబ్బులు పెట్టి, రైళ్లు ఏర్పాటుచేసి ఇండ్లకు పంపించారని గుర్తుచేశారు. వారికి అనేక సేవాసంస్థలు, వ్యక్తులు సహకరించారు కానీ.. మోదీ.. వారిని ఇండ్లకు పంపడం వల్లనే కరోనా పెరిగిందనటం దారుణమన్నారు. పొట్ట చేత పట్టుకొని ఉన్న వారిపై నిందలు వేయడం కంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదని దుయ్యబట్టారు.
వైద్యంలో దేశంలోనే తెలంగాణ అత్యుత్తమం
తెలంగాణ వైద్యరంగం దేశంలోనే అత్యుత్తమమైందని కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని హరీశ్ తెలిపారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నదని అని నీతి అయోగ్ చెప్పిందని.. బీజేపీ పాలిత యూపీ చిట్టచివరన నిలిచిందని పేర్కొన్నారు.