హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ అతిపెద్ద మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అందుకే ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఏచూరి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడారు. రాజ్యాంగ సంస్థలైన సుప్రీంకోర్టు, ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ), ఎలక్షన్ కమిషన్, ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) సీబీఐలు.. బీజేపీ చేతిలో బందీ అయ్యాయని అన్నారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీల తరపున పోటీలో ఉన్న అభ్యర్థులపై జరుగుతున్న ఐటీ దాడులను తప్పుపట్టారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘిస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఆయనకు నోటీసుఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.