సూర్యాపేట, ఫిబ్రవరి 28: ప్రభుత్వ ఉద్యోగుల జేబులను సీఎం కేసీఆర్ నింపుతుంటే.. వారి జేబులకు ప్రధాని నరేంద్రమోదీ చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపై ఉద్యోగులంతా పోరాడాలని పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నల్లగొండలో జిల్లా టీఎన్జీవో స్టాండింగ్ కమిటీ సమావేశాలను ప్రారంభించి, ఆ సంఘం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆ జిల్లా టీఎన్జీవోల డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పెరిగిన జీతభత్యాలకు అనుగుణంగా ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని పెంచకుండా కేంద్ర ప్రభుత్వం మీనమీసాలు లెక్కిస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారాన్ని అప్పగిస్తే 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని, నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచుతామని ప్రగల్భాలు పలికిన మోదీ.. తీరా అధికారంలోకి వచ్చాక 15 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని నిప్పులు చెరిగారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ, నల్లగొండ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.