తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష
రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 9 : ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ అపహాస్యం చేశారని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగా ణ ఏర్పాటును ప్రధాని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారా? అన్న అనుమానం కలుగుతున్నదని పేర్కొన్నా రు. మోదీ తెలంగాణపై ఎందుకు పగబట్టారో అర్థం కావటంలేదని ఆవేదన చెందారు. బుధవారం రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడుతూ ప్రధాని వ్యాఖ్యలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానించడమే కాకుండా దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ప్రధాని తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. తెలంగాణ సుదీర్ఘ పోరాటాన్ని, వందలమంది అమరవీరుల త్యాగాలను అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో14 ఏండ్ల తెలంగాణ పోరాట ఫలితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన తెలంగాణపై మోదీ అసహనం వ్యక్తంచేయటాన్ని ఆక్షేపించారు.
నిరుపేదలకు ఏంచేశారు?
ఆర్థిక మంత్రి 90 నిమిషాలసేపు చేసిన బడ్జెట్ ప్రసంగంలో 90 కోట్ల నిరుపేదల్ని తీవ్రంగా కలిచివేసిందని సురేశ్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. దేశంలో 82 శా తం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటే ఆ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యంచేసేలా బడ్జెట్ ఉన్నదని గణాంకాలతో సహా వివరించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేస్తామన్న మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ రూపకల్పన చేసిందన్నారు. ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రవచించిన నాలుగు సూత్రాలు దేశ పురోగతికి ఏమాత్రం దోహదంచేసేలా లేవని తెలిపారు. వ్యవసాయంలో తెలంగా ణ తెచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు. జాతీయస్థాయిలో ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరమున్నదని అన్నారు.