హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్లో చేసే చట్టాలను దేశంలోని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. ప్రభుత్వం చట్టాలను తయారు చేయడమే కాకుండా, సవ్యంగా అమలు చేసినప్పుడే వాటి గౌరవాన్ని కాపాడినట్టు లెక్క. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పార్లమెంట్ సాక్షిగా చేసిన రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని 11 ఏండ్లుగా అవమానిస్తూనే ఉన్నది. హక్కుగా తెలంగాణకు రావాల్సినవి కూడా ఇవ్వకుండా చట్టానికి తూట్లు పొడుస్తున్నది. తెలంగాణకు అన్యాయం చేస్తున్నది. అయినా రాష్ట్ర బీజేపీ నేతలు పట్టించుకోరు. గత దఫాలో నలుగురు ఎంపీలు, ఈ దఫాలో 8 మంది ఎంపీలు ఉన్నా ఫలితం మాత్రం సున్నా. పేరుకే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. విభజన చట్టాన్ని కూడా అమలు చేయించుకోలేని దీనస్థితి. ‘మాటలు కోటలు దాటుతాయి.
కాళ్లు తంగెళ్లు దాటవు’ అన్న సామెత వారికి సరిగ్గా వర్తిస్తుంది. ఒకటి రెండు పనులు చేసి వందల సార్లు ప్రచారం చేసుకోవడం తప్ప.. తెలంగాణకు చేసిందేమీ లేదు.. వీళ్ల వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ప్రజలు మండిపడుతున్నారు. ‘తెలంగాణ రాష్ట్రం కోసం మేము కూడా కొట్లాడినం. పార్లమెంట్లో మద్దతు ఇచ్చినం’ అంటూ క్రెడిట్ తీసుకోవడానికి ఎగబడుతున్న బీజేపీ నేతలు.. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి మాత్రం భయపడుతున్నారు. ఏపీ విభజన అనంతరం తెలంగాణకు కేంద్రం ఎలా చేయూత ఇవ్వాలో పనర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచింది. కానీ 11 ఏండ్లు గడుస్తున్నా హామీలను అమలు చేయకుండా కేంద్రంం తెలంగాణకు అన్యాయం చేస్తున్నది. యూపీఏ ప్రభుత్వం చేసిన చట్టంతో తమకు సంబంధం అన్నట్టు వ్యవహరిస్తున్నది. అయినా రాష్ట్ర నేతలు పట్టించుకోవడంలేదు.
విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారంలో సెయిల్ ఆధ్వర్యంలో రూ.36 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఇది విభజన హామీ మాత్రమే కాదు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ ప్రజల హక్కు’ అని మార్మోగిన నినాదం. ఇక్కడ 51 హెక్టార్ల పరిధిలో అపారమైన ముడిఖనిజ నిక్షేపాలు ఉన్నాయని గతంలోనే నిర్ధారించారు. ఏటా 4 లక్షల టన్నుల ఖనిజాన్ని వెలికి తీసినా 22 ఏండ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని గణించారు. అవసరమైతే ఛత్తీస్‌గఢ్ నుంచి ముడి ఇనుమును తీసుకొచ్చేందు రైల్వే శాఖ సర్వే నిర్వహించేందుకు 2018 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. అయినా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం సహకరించడం లేదు. రాష్ట్ర బీజేపీ నేతలుగానీ, ఎంపీలుగానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదు. పైగా.. ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగంగా చెప్పడం కొసమెరుపు.
ఏపీలోని పోలవరానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలో ఏదేని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం స్పష్టంగా విభజన చట్టంలో పేర్కొన్నది. కాళేశ్వరం లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని స్వయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఎంపీలు ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. 2018 ఆగస్టులో అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ‘ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చేది లేదు’ అని ప్రకటించారు. కానీ ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, ఉత్తరప్రదేశ్-మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన కెన్-బెట్వా రివర్ లింక్ ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. వాస్తవానికి కేంద్రం ప్రకటించేనాటికి ఆ రెండు ప్రాజెక్టులకు పూర్తి స్థాయి అనుమతులు కూడా రాలేదు. అయినా ఆ రాష్ట్ర నేతలు అనుమతులు సాధించారు. కానీ బీజేపీ తెలంగాణ నేతలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు మాత్రం రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన జాతీయ హోదా సాధించలేదు. పైగా తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో తప్పులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపితే ఎగిరి గంతేసిన తెలంగాణ ఎంపీలు, రాష్ట్ర ప్రాజెక్టుపై మాత్రం విమర్శలు చేయడం సిగ్గుచేటని నిపుణులు విమర్శిస్తున్నారు.
విభజన చట్టం ప్రకారం రాష్ర్టానికి గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలని పదేండ్లపాటు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పెడచెవిన పెట్టింది. చివరికి నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎస్టీల ఓట్లు దండుకునేందుకు 2023 డిసెంబర్లో గిరిజన వర్సిటీని మంజూ రు చేసింది. వాస్తవానికి విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీకి గిరిజన వర్సిటీలు మంజూరు చేయాలి. ఇచ్చిన హామీ మేరకు ఏపీకి 2017లోనే కేంద్ర ప్రభుత్వం వర్సిటీని మంజూరు చేసింది. స్థలం లేకున్నా, వసతులు లేకున్నా తరగతులు ప్రారంభించింది. కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 300 ఎకరాలను సేకరించినా కేంద్రం పట్టించుకోలేదు. వర్సిటీ మంజూరు చేయలేదు. రాష్ట్రం నుంచి గత దఫాలో 4 ఎంపీలు గెలిచినా, అందులో ఒకరు కేంద్ర మంత్రిగా పనిచేసినా వర్సిటీని తేవడంలో విఫలమయ్యారు.
విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.50 కోట్ల చొప్పున విడుదల చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఏటా రూ.450 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. ఈ నిధుల విడుదలకు కేంద్రం పదే పదే తిప్పించుకుంటున్నది. పలుమార్లు లేఖలు రాస్తే రెండుమూడేండ్లకు ఒకసారి విడుదల చేస్తూ సహనాన్ని పరీక్షిస్తున్నది. ఇప్పటికీ బకాయిలు రావాల్సి ఉన్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. ఇందులో 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారు. పాలనా సంస్కరణల ఫలితంగా రాష్ట్రం 33 జిల్లాలుగా మారిన నేపథ్యంలో 31 జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వాలని తెలంగాణ పదుల సార్లు విజ్ఞప్తి చేసింది. అయినా కేంద్రం పట్టించుకోలేదు. తెలంగాణ ఎంపీలు ఎప్పటిమాదిరే గప్‌చుప్‌గా ఉండిపోయారు.
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలను పునర్వ్యవస్థీకరించి 153కు పెంచే అంశాన్ని పరిశీలించాలని విభజన చట్టంలో పొందుపరిచారు. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏండ్లు అయినా ఈ అంశాన్ని కనీ సం పరిశీలించలేదు. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. అయినా ఇప్పటివరకు ఒక్క బీజేపీ ఎంపీ కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదు.