హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): గతం లో పార్లమెంట్ సాక్షిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. ఇప్పు డు అదే కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎైక్సెజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆక్షేపించారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి నాలుగు ఓట్ల కోసం ఇంతలా దిగజారి మాట్లాడాలా? అని నిలదీశారు. శనివారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్, ఎంపీ బీ వెంకటేశ్ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం పేచీలు పెట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారని, కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ నిత్యం తెలంగాణ గురించి పరితపిస్తుంటారని పార్లమెంట్లో గతంలో ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారని శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు. నాడు బెల్లం అయి న వ్యక్తి.. నేడు అల్లంగా ఎలా మారారని నిలదీశారు. కేవలం ఓట్ల కోసమే వరంగల్ సభలో తెలంగాణపై, సీఎం కేసీఆర్‌పై మోదీ విషం కక్కారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని పార్లమెంట్లో కేంద్ర మంత్రి సమాధానం చెప్పిన విషయం మోదీకి తెలియదా? అని ప్రభుత్వ చీఫ్ విప్ టీ భానుప్రసాద్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వానికి నిధులు ఇచ్చారా? అని నిలదీశారు.
ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని ఎంపీ బీ వెంకటేశ్ విమర్శించారు. రాష్ట్ర పుట్టుకపై కూడా మోదీ విషం చిమ్మారని మండిప డ్డారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసారి ఆదాయం 87 శాతం ఎకువ అనే విషయాన్ని ప్రధాని గుర్తించాలన్నారు. దేశానికి మోదీ ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రశ్నించారు.