హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండ ఉండగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచి కొట్టింది. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, యాదాద్రిభువనగిరి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో చాలాచోట్ల రెండు గంటలపాటు వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రెండుగంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది.
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో పంటలు నేలవాలాయి. ధాన్యం తడిసింది. మామిడికాయలు నేలరాలాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట, వలిగొండ, సంస్థాన్‌నారాయణపురంలో పిడుగుపాటుకు మూడు బర్రెలు మృతిచెందాయి. మంచిర్యాల కార్పొరేషన్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, ఉమ్మడి మెదక్‌లో అకాల వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఇస్రీతాబాద్లో పిడుగుపడి 20 గొర్రెలు మృతి చెందాయి. గజ్వేల్ పట్టణానికి చెందిన ఇమ్మత్‌ఖాన్(55) ఎలక్ట్రీషియన్ పనిచేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు గోడకూలి మృతిచెందాడు. ములుగు, జోగుళాంబ జిల్లాల్లోనూ వర్షం కురిసింది. మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశించారు.