హైదరాబాద్, జూన్ 14 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ తర్వాత మూడు రోజుల పాటు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయని అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో సంగారెడ్డి, జోగుళాంబ-గద్వాల, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో అత్యధికంగా 11.23 సెం.మీ వర్షపాతం నమోదైంది. అదే విధంగా జోగులాంబ-గద్వాల జిల్లా కొల్లూరులో 8.47 సెం.మీ, నారాయణపేట జిల్లా కృష్ణలో 7.82 సెం.మీ, వనపర్తి జిల్లా రేవెల్లిలో 7.16 సెం.మీ, వికారాబాద్ జిల్లా పూడూరులో 6.75 సెం.మీ, మొయిన్‌పేటలో 6.25 సెం.మీ, నవాబ్‌పేటలో 6.14 సెం.మీ, బొమ్రాస్‌పేటలో 6.06 సెం.మీ, చౌడాపూర్‌లో 6.02 సెం.మీ, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 5.53 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. కాగా, రాష్ట్రంలోని 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు సాధారణ వర్షపాతం 52.1 మి.మీ కురువాల్సి ఉండగా, ఆదివారం నాటికి 48.4 మి.మీగా నమోదైనట్టు తెలిపారు. కేవలం నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే అత్యధిక సగటు వర్షపాతం నమోదైనట్టు చెప్పారు. ఇక ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నట్టు తెలిపారు. నిర్మల్‌లో 40.6, కామారెడ్డిలో 40.5, పెద్దపల్లిలో 40.3, నిజామాబాద్‌లో 40.2, జగిత్యాలలో 40.1, వరంగల్‌లో 40.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.