హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా క్యుమిలోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడటంతో కొద్ది సమయాల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికితోడు ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో ఈనెల 13వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం మంచిర్యాల, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయని తెలిపింది.
బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసినట్టు పేర్కొన్నది. గత 24గంటల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లా కనగల్‌లో 11.53 సెం.మీ, నిడమనూర్‌లో 8.41 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.