హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తాయని అంచనా వేసినట్టు పేర్కొన్నది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నగరంలో క్యుమిలోనింబస్ మేఘాల ప్రభావంతో సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించింది. గురువారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది.
శుక్ర, శనివారాల్లో యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించింది. గడిచిన 24గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, వరంగల్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో అత్యధికంగా 7.38 సెం.మీ, సదాశివనగర్‌లో 4.15 సెం.మీ, బాన్సువాడలో 3.84 సెం.మీ, నిజామాబాద్ జిల్లా నిజామాబాద్(సౌత్‌లో) 5.53 సెం.మీ, నిజామాబాద్ (నార్త్)లో 5.01 సెం.మీ, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 4.88 సెం.మీ వర్షపాతం కురిసినట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.