 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలకు కారణమైన మొంథా తుఫాను బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉత్తరాంధ్ర తీరం, ఈశాన్య తెలంగాణలో కేంద్రీకృతమైన తీవ్రవాయుగుండం… తీవ్ర అల్పపీడనంగా మారిందని చెప్పారు. గురువారం తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్లో కొనసాగిందని వాతావరణశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు ఉందని చెప్పారు. ఇది 24 గంటల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా మారే అవకాశముందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు కురిసినట్టు వెల్లడించారు. ఈశాన్య రుతుపవనాల వల్ల అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కురిసే వర్షాలు అంచనాలకు మించి నమోదవుతున్నట్టు చెప్పారు. ఈ సమయంలో కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతం 11.02 సెం.మీ కాగా.. ఇప్పటికే 17.49 సెం.మీ వర్షపాతం నమోదైందని వివరించారు.
 
                            