కరీంనగర్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేద్దామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ డిమాండ్‌పై ఈ నెల 10న తాను ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని రాంలీలా మైదానంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ ఉమెన్స్ డే వేడుకల్లో మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. ఆడపిల్లలు ఉన్నతంగా ఆలోచించి, ఉన్నతమైన రంగాలను ఎంచుకుని అందులో రాణించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను వినియోగించుకొని విద్యతోపాటు మిగతా రంగాల్లో మహిళలు రాణించాలని కోరారు. అవకాశాలను అందిపుచ్చుకొనే ఆత్మైస్థెర్యాన్ని సీఎం కేసీఆర్ మహిళల్లో కల్పించారని చెప్పారు.
పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆడబిడ్డల సంక్షేమం కోసం కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ ఆసరా వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలను కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని, మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందని మంత్రి జోస్యం చెప్పారు.
మహిళా రిజర్వేషన్ కోసం ఎమ్మెల్సీ కవిత తొమ్మిదేండ్లుగా పోరాటం చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అన్నారు. నాడు ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలైతే దాదాపు 180 ఎంపీ స్థానాలు మహిళలకు దకుతాయని, ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిళ్లలో రిజర్వేషన్లు లభిస్తాయని పేరొన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వయంగా అందజేశారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ ఎంపీలు, కవిత చేస్తున్న పోరాట చరిత్ర బీజేపీ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ఇవేమీ కనిపించకపోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, లోక్‌సభలో ఆమోదం పొందలేదని, ప్రధాని మోదీ తలుచుకుంటే ఇది సాధ్యం అవుతుందని అన్నారు. కానీ, మోదీకి చిత్తశుద్ధి లేదని, అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలుపడం లేదన్నారు.10న ఢిల్లీలో కవిత చేపట్టనున్న మహిళా రిజర్వేషన్ల దీక్షకు దేశంలోని మహిళలు సంపూర్ణ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళకు డీఆర్డీవో ద్వారా రుణాలు పంపిణీ చేశారు. టీవీ యాక్టర్లు, వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను కవిత, సత్యవతి ఘనంగా సన్మానించారు. అనంతరం కవిత, సత్యవతిని ఎమ్మెల్యే బాలకిషన్ సన్మానించారు. ముందుగా తెలంగాణ అమర వీరులస్థూపం నుంచి సభా వేదిక వరకు బతుకమ్మలతో కోలాట ఆటలతో భారీ ర్యాలీ తీశారు.
స్త్రీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ గడ్డమీద పుట్టడం ఆడపిల్లల అదృష్టమని అన్నారు. గర్భిణుల కోసం రూ.250 కోట్లు ఖర్చుచేసి కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నామన్నారు.
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మ హిళా ఉద్యోగులకు బుధవారం ప్రత్యేక సెలవుదినాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.