కవాడిగూడ, మార్చి 16: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. అసెంబ్లీ ముట్టడికి యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు విడతల వారీగా ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి వారు అసెంబ్లీని ముట్టడించేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కొద్దిసేపు ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి నగరంలోని పలు పోలీస్స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఐసీడీఎస్ పథకానికి సరిపోయినన్ని నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించి ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు సైతం ఒంటిపూట బడులను అమలు చేయాలని అన్నారు. ప్రైమరీ విద్యను అంగన్వాడీలలో నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ వర్కర్ల కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్స్‌కు ఈ విధానాన్ని అమలు చేస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మే ఒకటో తేదీ నుంచి 31 వరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఒకేసారి సెలవులను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, పద్మశ్రీ, కార్యదర్శులు జే వెంకటేశ్, సుధాకర్, శ్రీకాంత్, అంగన్వాడీ యూనియన్ నాయకులు సునిత, పద్మ తదతరులు పాల్గొన్నారు.