హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): అదానీతో సీఎం రేవంత్‌రెడ్డి అంటకాగుతున్న వైనాన్ని శాసనసభ వేదికగా ఎత్తిచూపేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారనే విషయం తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఉభయసభల్లో అడుగుపెట్టకుండా అసెంబ్లీ గేటు ముందే అరెస్టు చేశారు. అనంతరం వారిని హైదరాబాద్ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల మీదుగా తిప్పుతూ తెలంగాణ భవన్లో విడిచిపెట్టారు. అక్రమ అరెస్టులకు నిరసనగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తెలంగాణభవన్ ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి విధానాలను ఎండగడుతూ చేసిన నినాదాలు ఆ పరిసరాల్లో మారుమోగాయి.
కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, దేశపతి శ్రీనివాస్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, విజయుడు తదితరులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. దేశపతి శ్రీనివాస్ ఆలపించిన ‘గోవిందా.. గోవిందా.. కల్యాణలక్ష్మి గోవిందా.. తులం బంగారం గోవిందా..’ అంటూ.. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎలా రద్దు చేసిందో పాట రూపంలో విమర్శనాత్మకంగా వినిపించారు. అలాగే ‘తల్లి తెలంగాణమా.. తనువెల్లా మా గాణమా.. వంటి ఉద్యమపాటలను ఆలపించారు. మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు చప్పట్లు కొడుతూ ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు. తెలంగాణ తల్లి విగ్రహం శిల్పశాస్త్ర ప్రకారం లేదని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి పేర్కొన్నారు.