ఖమ్మం, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కాంగ్రెస్ సర్కార్కు సవాల్ విసిరారు. ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి.. బీసీలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని భద్రాద్రి జిల్లా పర్యటనకు వస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి శూన్యమని ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని ఆరోపించారు. జోగుళాంబ గద్వాల, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పర్యటిస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ అమలుకాని నంబర్ గేమ్ మాత్రమేనని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 571 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఇందులో బీసీలకు సర్పంచ్ స్థానాలు 127 వరకు రావాల్సి ఉండగా 54 మాత్రమే కేటాయించి, తీవ్ర మోసానికి గురిచేసిందని దుయ్యబట్టారు.
భద్రాద్రి జిల్లాలో మంగళవారం జరిగే సీఎం పర్యటనపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలు చర్యలు తీసుకోవాలని తాతా మధు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ చీరలు ఇచ్చామని, మహిళలు చీరలు కట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటని ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎన్నికల విలువలను దిగజార్చడమే అవుతుందని మండిపడ్డారు. రెండేళ్లలో జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏమిటో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మద్దతు ధర పేరుతో దగా చేస్తున్నారని, దళారుల దందా పెరిగిపోయిందని ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. వరదలతో పంట నష్టపోయిన రైతులు, ప్రజలకు సాయం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో యూరి యా కోసం రైతులు అనేక కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు జిల్లా కేంద్రం లో 28 ఎకరాల స్థలం కేటాయిస్తే.. పంపిణీ చేయకుండా వారిని నిట్టనిలువునా వంచిస్తున్నదని ఆరోపించారు.