MLC Tata Madhu | ఖమ్మం : తాను అధికారులను దూషించినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పాత వీడియోను , సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాజా వీడియోగా చిత్రీకరించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తాలేని కొన్ని పార్టీలు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ ప్రచారానికి తెరలేపింది. ఆ వీడియో 2019 నాటిదని తెలిపారు. అప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొందరి అధికారుల తీరుకు నిరసనగా తాను ఆ మాటలు మాట్లాడానని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
ఆ కామెంట్స్ చేసిన సందర్భంలో తాను ఎమ్మెల్సీగా లేనని తాతా మధు స్పష్టం చేశారు. కావాలని తనను టార్గెట్ చేసి ఈ రకమైన ప్రచారానికి ఒడిగట్టారని భావిస్తున్నాను. పాత వీడియోను, కొత్త వీడియోగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బహిరంగంగా ప్రెస్మీట్లు పెట్టి అధికారుల తాటతీస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్న రేవంత్ రెడ్డి లాగా తాము బరితెగించి లేము. పదేపదే తెలంగాణ అధికారుల మనోభావాలను దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డి సంగతి ప్రజలు గమనిస్తున్నారు. అప్పటి పరిస్థితుల్లో కార్యకర్తల రక్షణ కోసం మాత్రమే అలా మాట్లాడాను తప్ప అధికారులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు.