హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఇస్తామన్న రూ.2,500, రైతు భరోసా ఎకరాకు రూ.15,000, రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు, వడ్లకు బోనస్, కల్యాణలక్ష్మి కింద ఇస్తానన్న తులం బంగారం ఏమయ్యాయని, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇండ్ల స్థలాలు ఏవని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు నిలదీశారు. ‘ముఖ్యమంత్రి హోదాలో జుగుప్సాకరంగా మాట్లాడుడేంది? రేవంత్‌రెడ్డీ.. నాలుక జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. వైరాలో సీఎం మాట్లాడిన మాటలు ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయని, సీఎం పదవిని దిగజార్చుతున్న రేవంత్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు చెప్పుతో ఉరికించి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు. ముసలోళ్లను కూడా మోసగించిన రేవంత్‌ను ప్రజలు ఎలా క్షమిస్తారని ప్రశ్నించారు.
అసెంబ్లీ మీడియా హాల్లో శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై రేవంత్ మాట్లాడిన తీరు, భాష సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టు ప్రారంభానికి వెళ్తే రైతులనుద్దేశించి మాట్లాడాలి గాని, సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడటం తగదని హితవుపలికారు. 50 ఏండ్లు ప్రజాజీవితం, 14 ఏండ్లు రాష్ట్ర సాధనోద్యమం, పదేండ్లు సీఎం, 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీని నడుపుతున్న కేసీఆర్, రాష్ట్ర ఉద్యమం నుంచి వచ్చిన కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి రేవంత్‌రెడ్డి అడ్డగోలుగా మాట్లాడటం ఏమిటని నిలదీశారు. ‘రుణమాఫీ ఎక్కడా సరిగా అమలుకాలేదు. వడ్డీలు మాత్రం కట్టించుకుంటున్నరు. ‘ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో గ్రామాలకు వెళ్లి చూద్దామా’ అని సవాల్ విసిరారు. రైతుల ఖాతాల్లో ఎన్నివేల కోట్లు వేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలు తిరగబడుతరు : తాతా మధు
సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వమని, తామే చేసినట్టు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం ఎవరో కన్న బిడ్డను తన బిడ్డ అని చెప్పుకొన్నట్టుగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఎద్దేవాచేశారు. వైరాలో అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు ఇప్పుడు భరించినా తర్వాత తిరగబడతారని హెచ్చరించారు. ప్రజాపాలన అని చెప్పకొనే రేవంత్‌రెడ్డి ముంద స్తు అరెస్టులు ఎందుకు చేయిస్తున్నారని, బీఆర్ఎస్తోపాటు ఇతర విపక్ష నేతలను ఎందుకు గృహ నిర్బంధం చేశారని ప్రశ్నించారు.
2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీల్లోని 13 హామీలను ఆగస్టు 15లోగా పూర్తిచేస్తేనే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు అన్నారని, రాజీనామా లేఖను గతంలో గన్పారు వద్ద మీడియాకు ఇచ్చారని గుర్తుచేశారు. ఆ లేఖలో పేరొన్న ఏ ఒక అం శాన్నీ అమలుచేయకుండా హరీశ్‌రావును రాజీనామా అడిగే హకు రేవంత్‌రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించారు. ‘మీ రుణమాఫీ చారిత్రక ఘట్టమైతే కాంగ్రెస్ నేతలు గన్మెన్లను పకన బెట్టి గ్రామాలకు వెళ్లాలి. సదస్సులు పెట్టి రుణమాఫీపై చర్చించాలి. అపుడు తెలుస్తుంది రైతుల్లో ఉన్న ఆగ్రహం. వాళ్లు ఉరికించి కొడుతరు’ అని హెచ్చరించారు. ‘పీసీసీ హోదాలో నీకు నచ్చినట్టు ఉండు. కానీ సీఎం హోదాలో ఎలా మాట్లాడాలో తెలియదా?. చిల్లరగా మాట్లాడితే తెలంగాణ పరువుపోతున్నది. రేవంత్ ప్రవర్తన సీఎం పదవి స్థాయిని దిగజార్చేలా ఉన్నది’ అని తాతా మధు విమర్శించారు.