హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్ : ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలలో తన ఫాంహౌస్లేదని, ఒకవేళ హైడ్రా నోటీసులు ఇస్తే.. తెల్లారే తన ఇంటిని తానే కూల్చేస్తానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారమే ఫాంహౌస్ నిర్మించినట్టు తెలిపారు. 111 జీవో ప్రకారం చాలా మంది పెద్దలు భవనాలు నిర్మించుకున్నారని, అందరితో పాటు తాను కూడా నిర్మించుకున్నానని చెప్పారు. తన ఫాంహౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ వచ్చిన విమర్శలపై ఆయన స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గండిపేట చెరువు పైభాగాన కొత్వాల్‌గూడలో 14.14 ఎకరాల భూమిని 1999లో కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ భూమి తన కొడుకు రినీష్ పేరుపై ఉన్నట్టు చెప్పారు. పట్టా భూమి నే కొనుగోలు చేశానని వివరించారు. అక్కడ ఇరిగేషన్ అధికారులు, కలెక్టర్ చెప్పిన విధం గా నిబంధనల ప్రకారమే ఇల్లు కట్టుకున్నాన ని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉందంటే తానే కూల్చివేస్తానని, ప్రభుత్వం కూల్చాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు. చెరువుల కబ్జాను కూల్చాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇప్పటివరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఒకవేళ వస్తే తెల్లారే ఇంటిని కూల్చేస్తానని చెప్పారు.