హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్పై కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి కుట్రలు ఎన్నటికీ సాగవని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. తెలంగాణ అంటే నక్సలైట్లు అన్న సందర్భంలో ఉద్యమ నేత కేసీఆర్ ఆనాడు పార్టీ పెట్టారని, అప్పటికే దిగ్గజ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలకు ధీటుగా బీఆర్ఎస్ను స్థాపించి, వైఎస్సార్, చంద్రబాబు లాంటి బలమైన నాయకులను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఏర్పడి నిలిచి గెలిచిన బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తున్నారంటూ కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందని, దేశంలో ఎన్నో పార్టీలు వస్తాయి పోతాయిగాని బీఆర్ఎస్ మాత్రం అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో చెక్కు చెదరకుండా ఉంటుందని స్పష్టంచేశారు.
సాధ్యం కాని తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సుసాధ్యం చేసి అభివృద్ధి చేశారని, ఈ క్రమంలో బీఆర్ఎస్ను బలహీన పరచాలని కుట్రపూరిత ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడలేవని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేక పోవడం వల్ల తెలంగాణ ప్రజలంతా బాధ పడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన గురించి చర్చకు వస్తే కాంగ్రెస్, బీజేపీ రాజకీయ పునాదులు కదలుతాయని చెప్పారు. కేంద్ర మంత్రుల హోదాలో ఉన్న కొందరు నాయకుల భాష, వారి పాలనను ప్రజలు అసహ్యించుకునేలా ఉన్నదని విమర్శించారు.
2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ భవన్లో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సిరికొండ తెలిపారు. అందులో భాగంగా జెండాను ఎగురవేసి, పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇదే రోజున కాళేళ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
పార్టీలో ఏ నిర్ణయమైనా కేసీఆర్‌దే
బీఆర్ఎస్కు సంబంధించి ఏ నిర్ణయమైనా తమ అధినేత కేసీఆరే తీసుకుంటారని, ఆయన ఆలోచనలు తనకు తెలుసని, తెలంగాణ ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ భంగం కలిగించరని సిరికొండ స్పష్టంచేశారు. ప్రస్తుతం పార్టీలో పరిణామాల గురించి తమకు ఎక్కువే తెలుసని, ఏ నిర్ణయమైనా కేసీఆర్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.