హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పాలనా కాలంలో ఆడబిడ్డల సంక్షేమానికి ఎంతగానో పాటుపడ్డారని, వారికోసం దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మంగళవారం ఒక ప్రకటనలో కొనియాడారు. ‘ఆడబిడ్డలను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం’ అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ మూర్తీభవించిన మానవత్వానికి ప్రతిరూపంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలే నిలుస్తాయని ప్రశంసించారు. కేసీఆర్ మనుసులో నుంచి రూపుదిద్దుకున్న మహోన్నతమైన ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు మేలు జరిగిందని తెలిపారు. దీని ద్వారా యువతుల వివాహానికి రూ.1,00,116 ఆర్థికసాయం అందించారని తెలిపారు.
గర్భిణులు, శిశువుల ఆరోగ్యం కోసం 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌ను తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన వారికి ఆడపిల్ల పుడితే రూ.13,000, మగ పిల్లవాడు పుడితే రూ.12,000 చొప్పున ప్రోత్సాహకాలను ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు సురక్షితంగా జరిగేలా చేసి ఆయా కుటుంబాలకు ఆర్థికభారం తగ్గించినట్టు తెలిపారు. ప్రసవం అనంతరం ఇంటికి చేరడం కోసం అమ్మఒడి పేరుతో ఇంటికే వాహ నం వచ్చేలా చర్యలు చేపట్టారని తెలిపారు. బతుకమ్మ కోసం మహిళలకు చీరల పంపిణీ, వారి భద్రత కోసం షీటీమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. వీటితో పాటు వితంతువులకు పింఛన్, బాలికల కోసం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రపంచంతో పోటీపడేలా కేసీఆర్ తెలంగాణను రూపుదిద్దితే, పరువు తక్కువ తెలంగాణగా దిగజార్చింది రేవంత్ సర్కార్ అని దుయ్యబట్టారు.