హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు పెట్టి ఆత్మైస్థెర్యాన్ని దెబ్బ తీసేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ కుట్ర చేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ పార్టీ డైరీ-2025 ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లు చరిత్రాత్మక పోరాటం చేసిందని గుర్తుచేశారు. పోరాటాలు, కేసులు తమకు కొత్తేమీకాదని, ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని స్పష్టంచేశారు. కేసీఆర్ నాయకత్వంలో గతపదేండ్లలో రాష్ట్రంలో స్వర్ణయుగం కొనసాగిందని చెప్పారు. దొంగ హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై విషం కకుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల్లో కారుచీకట్లు క మ్ముకున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హామీలు అమలు చేయకపోతే సర్కార్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. అణచివేతతో దుర్మార్గపు వైఖరితో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. 2025 సంవత్సరాన్ని సవాల్‌గా స్వీకరించాలని, ఏ ఒకరిపై ఈగ వాలి నా పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఇంత తకువ కాలంలోనే ప్రభుత్వాన్ని ప్రజలు తిట్టడం ఎప్పుడూ, ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ, ప్రతిపక్ష పార్టీల నేతలను కక్షపూరితంగా ఇబ్బందులకు గురిచేయడం, ప్రజలను వంచించడం ఒక తెలంగాణలోనే జరుగుతున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతుండటంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామనే భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నదని తెలిపారు. ఫార్ములా-ఈ రేస్‌లో అవకతవకలు జరిగితే.. అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలేదని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని, కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్‌పై దాడి చేస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్ను తిట్టడం చూసి ప్రజలు ఛీకొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన నిలబడుతున్నందుకే అక్రమ కేసులు పెడుతున్నారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి హామీలు, వైఫల్యాలను క్యాలెండర్ రూపంలో ముద్రించి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపుతో రేవంత్‌రెడ్డి చేసే డైవర్షన్ పాలిటిక్స్‌ను ధీటుగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. 2025లో కాంగ్రెస్ పాలిట ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సింహస్వప్నంలా మారాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పుట్టిందే రాష్ట్ర సాధన, అభివృద్ధి కోసమని స్పష్టంచేశారు. పదవులను త్యాగం చేసి కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పార్టీని పెట్టారని, 14 ఏండ్ల పోరాటం తర్వాత తెలంగాణకు తొలి సీఎం అయ్యి దేశానికి దిక్సూచిలా మార్చారని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి అలవి కాని హామీలతోనే అధికారంలోకి వచ్చారని, ప్రశ్నిస్తే జైల్లో పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రివేంజ్రెడ్డిగా మారి బీఆర్ఎస్ నేతలపై కక్షపూరితంగా అక్ర మ కేసులు పెట్టి పైశాచికానందం పొందుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసా కింద ఏటా 15 వేలు ఇస్తామని 12 వేలే చేయడంతో అన్నదాతలు నిలదీస్తున్నారని.. వారిని డైవర్ట్ చేసేందుకు డ్రామా ప్లే చేస్తున్నారని విమర్శించారు.
ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్ గ్రాఫ్ పడిపోయినప్పుడల్లా ఏదో ఒక కేసు ద్వారా ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. నాడు తాను అధికార పార్టీలో ఉండి కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని దగ్గరి నుంచి చూశానని, నిమ్స్ దవాఖానలో కేసీఆర్ దీక్షను విరమించమని కోరితే, పార్టీ, పదవుల కోసం కాదు.. తెలంగాణ కోసం చేస్తున్నానని ప్రభుత్వానికి చెప్పమన్నారని గుర్తుచేశారు. రాష్ర్టాన్ని సాధించాక దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడరు. రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.