హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ మహాసభ (BCMahasabha) పోస్టర్‌ను బుధవారం ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం, రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్లుగా తాము మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కవిత పిలుపునిచ్చారు.
కాగా, కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్‌తో సావిత్రీ బాయి పూలే జయంతిని పురస్కరిం చుకొని ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టనుంది. ఈ బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు మరిన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్ధతు ప్రకటించాయి.
బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ పేర్కొన్నారు. తాము పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవుతాయని, తమ హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు.
అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు బీసీ మహాసభ పోస్టర్లను తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రదర్శించింది.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ..కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషికి తాము మద్ధతు ప్రకటిస్తున్నామ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బొల్లా శివశంకర్, పెంట రాజేష్, సుంకోజు కృష్ణమాచారి, ఆలకుంట్ల హరి, కుమారస్వామి, విజేందర్ సాగర్, రాచమల్ల బాలకృష్ణ, కోళ్ల శ్రీనివాస్, సాల్వా చారి, మురళి, నిమ్మల వీరన్న, లింగం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.