హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటం ఫలితాలు ఇస్తున్నది. మహిళా రిజర్వేషన్లు గురించి దేశంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీలను ఆలోచింపజేస్తున్నది. ఈ ఏడాది మార్చి నెలలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం, ఇటీవల 47 రాజకీయ పార్టీలకు లేఖలు రాయడం వంటి వాటి వల్ల ఇప్పటికే అనేక ముఖ్యమైన రాజకీయ పార్టీల మద్దతును కవిత కూడ గట్టారు.
కవిత ఒత్తిడితో తాజాగా కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చింది. హైదరాబాదులో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మహిళా బిల్లును ఆమోదించాలని తీర్మానం చేసింది. వర్కింగ్ కమిటీ పాల్గొనడానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలు హైదరాబాద్ కు వచ్చే ముందే మహిళా బిల్లు పై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలు మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ప్రస్తావించకపోవడానికి కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఒత్తిడితోనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడానికి దోహద పడిందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఏనాడు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడని కాంగ్రెస్ పార్టీ.. వర్కింగ్ కమిటీలో తీర్మానం చేయడం కవిత కృషినని చెబుతున్నారు.
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్కు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మొదటి నుంచి కవిత తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నారు. యూపీఏ హయాంలో 2010లో రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదం పొందిన ఆ తర్వాత నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వం లోక్సభలో ఆమోదింప లేకపోయింది.
2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదు. ఈ విషయాలను పదేపదే ఎమ్మెల్సీ కవిత ఎండగట్టడంతో కాంగ్రెస్లో చలనం మొదలైంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కవిత చేసిన పిలుపునకు అనేక రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాయి.
ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తృణముల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సీపీఐ , సీపీఎం, శివసేన తదితర ముఖ్యమైన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా జాబితాలో కాంగ్రెస్ పార్టీ చేరింది. మహిళా సాధికారతకు కల్వకుంట్ల కవిత ఎనలేని కృషి చేస్తున్నారని పలు మహిళా సంఘాలు, జాతీయ మీడియా ప్రశంసిస్తున్నది. కవిత పార్లమెంటు సభ్యురాలిగా 2014 నుంచి 2019 వరకు లోక్సభలో అనేక సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు మహిళా సాధికారతపై మాట్లాడారు.