భద్రాచలం, మార్చి 17: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీరామనవమి ఏర్పాట్లు చేయాలని, రెవెన్యూ, పోలీస్, దేవస్థానం, ఇతరశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీరామనవమి ఉత్సవ ఏర్పాట్ల పురోగతిపై ఆయాశాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఐటీడీఏ పీవో రాహుల్, శిక్షణ కలెక్టర్ సౌరబ్‌శర్మ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్పీ రోహిత్‌రాజ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఏఎస్పీ విక్రాంత్సింగ్, దేవస్థానం ఈవో దామోదరావులతో కలిసి సీతారామచంద్రస్వామి కల్యాణం, పట్టాభిషేకం ఏర్పాట్లపై శాఖలవారీగా సమీక్షించారు.
శ్రీరామనవమి ఉత్సవాలను జిల్లా ప్రతిష్టకు భంగం కలగకుండా వీఐపీ, పర్యాటకులు, భక్తులకు ప్రతిబింబంగా నిలిచేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. శ్రీరామనవమికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆయాశాఖల అధికారులు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ప్రధాన రహదారులు, ఆలయ మార్గాల్లో పిచ్చిమొక్కలు తొలగించి శుభ్రతను కచ్చితంగా పాటించాలని, రాకపోకలకు అంతరాయం కలగకుండా మార్గాలు సజావుగా ఉండేలా చూడాలని, తాగునీటిని భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు.
హోటళ్లు, అన్నదాన కేంద్రాల్లో నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, గ్యాస్ సరఫరాలో కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వైద్యశాఖ అధికారులు ఉత్సవాల సమయంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు ఏరియా ఆసుపత్రిలో 30 పడకలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. దర్శన లైన్ల వద్ద ప్రాథమిక వైద్యసేవలు, అంబులెన్స్ వాహనాలు, రక్తనిల్వలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆయాశాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి సూచించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో కలిసి మిథిలా స్టేడియం ఏర్పాట్లు, మాడవీధులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమావేశంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.