నిజామాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఖలీల్‌వాడి : కేసీఆర్ హయాంలో ఆడబిడ్డలకు రక్షణ దొరికితే, కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరుగుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాదిలో మొత్తం 2,34,158 కేసులు నమోదైతే దాదాపు 2,945 లైంగికదాడి, మహిళలపై దాడులు, వేధింపులు కలిపి 19 వేలకు పైగా ఘోరాలు మహిళలపై జరిగినవేనని, దీనిని బట్టి చూస్తే పరిస్థితి ఎంత భయానకంగా మారిందో అర్థం చేసుకోవచ్చునని వాపోయారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని, ఇప్పటికైనా ఆడబిడ్డల భద్రత విషయంలో సీఎం ప్రత్యేక సమీక్ష పెట్టాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ మాజీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు, మేయర్ దండు నీతూకిరణ్‌తో కలిసి సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు బీజేపీ తోక పార్టీగా మారిందని విమర్శించారు.
‘రఘునందన్‌రావు అంటే కాంగ్రెస్ ఎంపీయా?.. బీజేపీపై నేను మాట్లాడలేదు. రఘునందన్రావునూ ఏమనలేదు. నిజామాబాద్‌కు వచ్చినందున కాంగ్రెస్‌ను అభివృద్ధి విషయంలో నిలదీస్తే బీజేపీకి ఎందుకు ఉలికిపాటు?’ అని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నిలదీస్తే సీఎంకు రక్షణ గోడలా బీజేపీ నిలబడుతున్నదని దెప్పిపొడిచారు. టీఎస్ఎండీసీ చైర్మన్‌గా ఈరవత్రి అనిల్‌కు నియంత్రణ చేసే అధికారం ఉన్నా పెద్దవాగు, కప్పలవాగులో ఇసుక దోపిడీ జరుగుతున్నదని, పోలీస్ స్టేషన్ల ముందు నుంచే ఇసుక రవాణా అవుతున్నా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభించేదని, ప్రభుత్వానికి మైనింగ్ ఆదాయం పెరిగిందని వివరించారు. ఇప్పుడు మైనింగ్ ఆదాయం జీరో అయిందని, కాంగ్రెస్ నేతల ఆదాయం పెరిగిందని ఎద్దేవాచేశారు. ఇసుక, గుట్కా దందాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందని, పేట్రేగిపోతున్న గుట్కా దందాను పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రాజ్యాంగ విలువలకు రేవంత్ తూట్లు
‘రాహుల్‌గాంధీ రాజ్యాంగం అంటూ చిన్న పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడు’ అని కవిత మండిపడ్డారు. ఉల్టా పల్టా కేసులు పెట్టడం, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా విగ్రహాలు మార్చడం, జిల్లాలను పట్టించుకోకపోవడం, ఎన్కౌంటర్లు జరగడం ఇప్పుడు చూస్తున్నామని, రాష్ట్రంలో తుపాకీ మోతలు ఉండొద్దని కేసీఆర్ పాలన అందిస్తే రేవంత్‌రెడ్డి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. పీసీసీ చీఫ్ హోదాలో తొలిసారి నిజామాబాద్‌కు మహేశ్‌కుమార్‌గౌడ్ వచ్చినప్పుడు భరోసా ఇస్తాడనుకుంటే, నిధులపై ప్రకటన చేస్తాడనుకుంటే హైడ్రా మాదిరిగా నిడ్రా పెడతామమంటూ సామాన్యులను భయపెట్టాడని మండిపడ్డారు. ఈ ప్రకటనతో చిన్నపాటి రియల్ వ్యాపారులంతా కుదేలయ్యారని వాపోయారు. నిడ్రా తెచ్చి బుల్డోజర్లతో ఇండ్లు కూల్చేస్తామని చెప్పడంతో అందరూ భయపడుతున్నారని చెప్పా రు. సంక్రాంతి లోపు కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, మహిళలకు రూ.2500 ఆర్థిక సా యం, 18 ఏండ్లు నిండిన యువతులకు స్కూ టీలు, ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, రైతుభరో సా ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థ ల్లో ప్రజలు బీఆర్ఎస్వైపే చూస్తున్నారని, బాధ్య త కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ధరణితోనే రక్షణ ఉండేది
ధరణి ద్వారా రైతుల భూములకు రక్షణ ఉండేదని, బీరువాలో వేసి తాళం వేసుకున్నట్టే ఉండేదని కవిత గుర్తుచేశారు. ఇప్పుడు భూ భారతి ద్వారా ఏటా వీఆర్వోలు వచ్చి కొత్త పహాణీలు రాస్తారనడం రైతుల్లో భయాందోళనలను సృషిస్తున్నదని చెప్పారు. రైతులను నరక యాతన పెట్టేందుకే భూ భారతిని తెస్తున్నారని విమర్శించారు. పోర్టల్ ప్రారంభానికి, రీ సర్వేకు ముందే రైతుల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ను వీడిన కొందరు నాయకులు ఇప్పుడు తీవ్రంగా మథన పడుతున్నారని, కాంగ్రెస్‌లోకి ఎందుకు పోయామా అని బాధ పడుతున్నారని కవిత తెలిపారు. ‘డిప్యూటీ సీఎం భట్టి మొన్ననే రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నడు. 28వ తేదీ అని చెప్పిండు. రాష్ట్రంలో ఎవ్వరికీ రూపాయి కూడా రాలేదు’ అని ఎద్దేవాచేశారు. సమావేశంలో బీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి ఆయేషా ఫాతిమా, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సుజిత్‌సింగ్ ఠాకూర్, ప్రభాకర్‌రెడ్డి, సత్యప్రకాశ్, మాస్తా ప్రభాకర్, సుమిత్రానంద్, చింతా మహేశ్, శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ శంకర్ పాల్గొన్నారు.
బాన్సువాడను బంగారువాడ చేసిందే కేసీఆర్
బాన్సువాడను బంగారువాడలా మా ర్చిందే కేసీఆర్ అని కవిత గుర్తుచేశారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గ నేతలతో ఆమె సమావేశమయ్యారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా బాన్సువాడకు నిధుల వరద పారించింది కేసీఆర్ అని, రూ.12 వేల కోట్ల నిధులు, 9 వేల ఇండ్లు ఇచ్చారని, బీటీ రోడ్లు, దవాఖానలు, విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని చెప్పారు. ‘కేసీఆర్ ఇచ్చిన నిధులను ముందు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయనకు మంత్రిగా, స్పీకర్‌గా పదవులు ఇచ్చింది కేసీఆర్. కానీ ఇచ్చిన మర్యాదను ఆయన కాపాడుకుంటే బాగుండేది. రెక్కలు వచ్చిన తర్వాత తల్లిని వదిలేసిన బిడ్డలాగా.. గెలిచిన తర్వాత పార్టీ కష్టాల్లో ఉంటే వెంటనే పార్టీ మారిండు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమంటే ఇదే’ అని కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పార్టీ కష్టాల్లో ఉంటే బాధ్యత తీసుకొని ముందుకు సాగాలి. కానీ బరువు దించుకొని పక్కకు తప్పించుకున్నరు’ అని ఆక్షేపించారు. ‘వారిని మంచి మనస్సుతో మనం క్షమించినా తెలంగాణ చరిత్ర క్షమించదు.. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు వద్దకు, కార్యకర్తల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పాలి’ అని పార్టీ నాయకులకు సూచించారు. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాన్సువాడకు మంచి ఇన్చార్జిని ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. జుబేర్, విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.