హైదరాబాద్ / ములుగు, మే12 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ హయాంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సిద్ధం చేసిన 1.75 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ సర్కారు స్టాక్ ఎక్సైంజ్లో కుదువ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప్రైవేట్ కంపెనీ అయిన టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ గత ఏప్రిల్ 15న జీవో నంబర్ 24ను దొడ్డిదారిన జారీ చేసి రుణం తెచ్చేందుకు స్కెచ్ వేసిందని నిప్పులు చెరిగారు. ‘నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సిన ఉత్తర్వులను దాచిపెట్టడం ఎందుకు? విలువైన భూములను స్టాక్ ఎక్సైంజ్లో పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఏదైనా పరిస్థితుల్లో నష్టం వస్తే భూముల పరిస్థితి ఏమిటి? మన పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎందుకు?.. హెచ్సీయూకు చెందిన 400 ఎకరాలను కుదవబెట్టి తీసుకొచ్చిన రూ. 10 వేల కోట్లను ఏ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు? ఏపథకం అమలుకు వెచ్చించారు? ’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిర్ధిష్టమైన ఆధారాలతో తాను చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఒకవేళ తన ఆరోపణలు తప్పని భావిస్తే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ర్టాన్ని దివాలా తీయించారని దివాలాకోరు మాటలు మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి, 17 నెలల్లో రూ.1.80 లక్షల కోట్ల అప్పు ఎందుకు తెచ్చారని కవిత ప్రశ్నించారు. తెచ్చిన రుణాల్లో కేవలం రూ.80 వేల కోట్లు మాత్రమే అప్పులు చెల్లించారని, మిగిలిన లక్ష కోట్లతో బడా కాంట్రాక్టర్ల జేబులు నింపారని ఆరోపించారు. ఇం దులో సీఎం రేవంత్రెడ్డి 20శాతం కమీషన్ కింద అంటే రూ. 20 వేల కోట్లను దిగమింగారని ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని స్పష్టం చేశారు.
కేసీఆర్ పదేండ్లల్లో రూ. 4.17 లక్షల కోట్లు తెచ్చి లక్షలాది కోట్ల ఆస్తులు సృష్టించారని కవిత చెప్పారు. ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు కట్టారని, విద్యుత్తు కేంద్రాలు నిర్మించారని, రోడ్లు వేశారని, పల్లెప్రగతికి బాటలు వేశారని పేర్కొన్నారు. కానీ, రేవంత్ ప్రభుత్వం రూ. 1.80 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఒక్క రోడ్డు కూడా వేయలేదని, కనీసం చెరువుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించలేదని, ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇవ్వలేదని మండిపడ్డారు. తన మంత్రివర్గంలోని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లించారని ఆరోపించారు.
రేవంత్ పాలనలో తెలంగాణ ప్రజలను అడుగడుగునా అవమానిస్తున్నారని కవిత మండిపడ్డారు. హెచ్సీయూలోని 400 ఎకరాలను అమ్మవద్దని అడ్డుకున్న విద్యార్థులను కొట్టారని, వద్దన్న పర్యావరణ ప్రేమికులను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని తూర్పారబట్టారు. సీఎం రేవంత్ పాలనను గాలికొదిలి తెలంగాణను సాధించి తెచ్చిన కేసీఆర్ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అనే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి మరోసారి రుజువు చేశారని దెప్పిపొడిచారు.
యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయం సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో ఓపెన్ కాస్టు గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. సోమవారం ఆమె ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2012లోనే రామప్ప ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఓపెన్ కాస్టు మైన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తే నాడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఓపెన్ కాస్టు మైన్ల ఏర్పాటు ప్రయత్నాలను ముందుకు సాగనివ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాగానే మళ్లీ ఓపెన్ కాస్టు మైన్ల పేరుతో బొగ్గు తవ్వకాలకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో బ్లాస్టింగ్లు జరిపితే ఆలయం దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. ఏడాదిన్నరగా పట్టించుకోని మంత్రి సీతక్క ఇప్పుడు అందాల పోటీ కోసం రామప్ప వద్ద పైపై మెరుగులు దిద్దుతున్నారని దుయ్యబట్టారు. ఓ వైపు యుద్ధ వాతావరణం నెలకొంటే.. సీఎం మాత్రం అందాల పోటీల ప్రారంభోత్సవానికి హాజరయ్యారని అన్నారు. అనంతరం రా మాంజాపూర్లో నాంచారమ్మ జాతరకు హాజరై అమ్మవారికి పూజలు చేశారు. ఎరుకల కులస్తులతో సహపంక్తి భో జనం చేశారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో కవిత వెంట బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, తెలంగాణ ఎరుకల అధ్యక్షుడు లోకిని రాజు, నాయకులు కేతిరి భిక్షపతి, రాజశేఖర్, లోకిని సమ్మయ్య, ఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.