MLC Kavitha | మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది 20 సంవత్సరాలు దాటిందని, ఇంకా లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా, రాహుల్ ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో బిల్లును పాస్ చేసేందుకు ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించలేదని ధ్వజమెత్తారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చించేందుకు తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ.. ప్రధాని మోదీకి సోనియాగాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు ప్రస్తావించలేదని మండిపడ్డారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చలేదని ధ్వజమెత్తారు. ఏ రకంగా చూసినా మహిళా బిల్లు కోసం సోనియా, రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదని విమర్శించారు. మహిళా బిల్లును పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే మద్దతిస్తామని తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం తీర్మానం చేసిందని కవిత గుర్తు చేశారు. శుక్రవారం మరోసారి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తీర్మానం చేసిందని, సీఎం కేసీఆర్ లేఖ రాశారని చెప్పారు. తాను తన స్థాయిలో రకరకాల ఉద్యమాలు చేశానని, ఇతర పార్టీలతో కలిసి కూడా ఉద్యమాలు చేపట్టానన్నారు.
రాహుల్ గాంధీపై మాట్లాడే స్థాయి తనకు లేదని కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలపై కవిత విమర్శలు గుర్పించారు. ఏడాది క్రితమే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన నాయకులను ఈడీ పిలిపించి విచారించిందని, మరి గత ఏడాదిన్నర కాలంగా ఈ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీకి మధ్య అవగాహన కుదిరినందని.. అందుకే కాంగ్రెస్ నాయకులను ఈడీ విచారణకు పిలవడం లేదా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. రూ.5వేల కోట్ల మేర అవకతవకలు జరగాయన్న ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీపై ఉన్న కేసుల పరిస్థితి ఏంటని నిలదీశారు. బీజేపీకి కాంగ్రెస్‌కి మధ్య ఉన్న అవగాహన ఏంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటూ. మరో రాష్ట్రంలో అదే కమ్యూనిస్టులతో కొట్లాట పెట్టుకుంటుందన్నారు. ఒక దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీతో కొట్లాతుందని.. మరొక దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటారన్నారు. ఇలా బహుళ రాష్ట్రాల్లో.. బహుళ విధానాలను కాంగ్రెస్ అవలంభిస్తుందని కవిత విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అదానికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతూ.. ఇతర రాష్ట్రాల్లోనేమో వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మోసపూరి వైఖరి, ధ్వంద విధానాలు ప్రజలకు అర్థమైందని స్పష్టం చేశారు. రాజకీయ టూరిస్టులను స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వస్తున్నా రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి స్వాగతం పలుకుతున్నానంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు వచ్చి బిర్యాని తిని హ్యాపీగా వెళ్లాలని.. కానీ ద్వంద, మోసపూరిత వైఖరి తోటి మరొకసారి తెలంగాణ ప్రజలను దేశ ప్రజలను మభ్యపెట్టొద్దని హితవు పలికారు.