హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): సహేతుకమైన ఆధారాలు లేకుండానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని, అనుమానితురాలిగా కూడా లేని వ్యక్తిని ఏకంగా నిందితురాలిగా మార్చారని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చెప్పారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో ప్రస్తుతం కస్టడీలో ఉన్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టులో సోమవారం విచారణ కొనసాగింది. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సోషల్‌మీడియా వ్యవహారాలకు సంబంధించి మాత్రమే విజయ్‌నాయర్‌తో కవిత భేటీ అయ్యారని స్పష్టం చేశారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అరెస్ట్ నుంచి విచారణ వరకు మెటీరియల్ లేదని, ఆధారాలేవీ లేకుండానే, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే, ఈడీ కస్టడీలో ఉండగానే సీబీఐ ఆమెను ఎందుకు అరెస్ట్ చేసిందని ప్రశ్నించారు. కవిత బీఆర్ఎస్కు స్టార్ క్యాంపెయినర్ అని, చిదంబరం కేసులో ఇచ్చిన తీర్పు కవిత విషయంలో వర్తిస్తుందని, ఏడేండ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని వెల్లడించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన అరుణ్ రామచంద్రన్ పిళ్ళై 10 స్టేట్మెంట్స్ ఇచ్చారని, కవితకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని తెలిపారు. అనుమనితురాలిగా కూడా లేని కవితను నిందితురాలిగా మార్చారని చెప్పారు. విచారణకు హాజరైనా మార్చి 15న అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు.
కవిత- కేజ్రీవాల్‌ను కలిపి విచారించడంలో ఈడీ విఫలమైందని సింఘ్వీ తెలిపారు. విజయ్‌నాయర్ సోషల్ మీడియా వ్యవహారం చూస్తారని, ఆ అంశం పైనే ఆయనతో కవిత భేటీ అయ్యారని వివరించారు. బుచ్చిబాబు నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారని, ఈడీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాకే ఆయనకు బెయిల్ వచ్చిందని తెలిపారు. రాఘవరెడ్డి బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్నారని, ఆయన ఎందుకు ఆ పార్టీలో చేరాల్సింది వచ్చిందని ప్రశ్నించారు. శరత్‌రెడ్డి బీజేపీ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తి అని తెలిపారు. వాళ్లు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కవితను అరెస్ట్ చేశారని నొక్కిచెప్పారు. ఎవరికి ఫోన్ ఇచ్చినా ఫార్మాట్ చేసే వాడతారని కవిత న్యాయవాది వెల్లడించారు. కవిత వాడిన ఆరు మొబైల్ ఫోన్లను కూడా ఈడీకి ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ కు కవిత స్టార్ క్యాంపెయినర్ అని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ వాదనను సీబీఐ తరఫు న్యాయవాది వ్యతిరేకిస్తూ లికర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని, బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారన్నారు. అనంతరం ఈడీ తన వాదనలను వినిపించింది. ఫోన్లను కావాలని ఫార్మాట్ చేశారని, 11 మొబైల్ ఫోన్లలో డాటాను ధ్వంసం చేశారని, ఇదే విషయాలను కేసు ఫైల్లో కూడా వివరించామని ఈడీ తెలిపింది. తదుపరి విచారణ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొనసాగనుంది. తుది ఉత్తర్వులను మే 2 వరకు రిజర్వు చేయనున్నట్టు జడ్జి కావేరి బవేజా ముందుగానే వెల్లడించారు.