MLC Kavitha | ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఫుడ్ పాయిజన్‌తో మరణించిన గిరిజన పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, అనిల్ జాదవ్‌ను అడ్డుకోవడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవం నాడే రాజ్యాంగ హక్కులకు రేవంత్ ప్రభుత్వం తూర్పార పొడస్తోందని విమర్శించారు. నియంతృత్వ పోకడలకు రేవంత్ రెడ్డి సర్కార్ నిదర్శనమని అన్నారు.
ఫుడ్ పాయిజన్‌తో మరణించిన వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ (Shailaja) స్వగ్రామం బాదాలో పోలీసులు భారీగా మోహరించారు. శైలజ మృతదేహం ఆసిఫాబాద్ జిల్లా బాదా గ్రామానికి చేరుకున్నది. దీంతో ఆమె బంధువుల, గ్రామస్తులు అంబులెన్స్‌ను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆమె డెడ్‌బాడీని అందులోని నుంచి దించకుండా అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారందరిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అడుగడుగునా మోహరించారు. గ్రామంలోకి ఇతరులు ఎవరూ రాకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. సరైన ధృవపత్రాలు చూపిన తర్వాతే గ్రామానికి అనుమతిస్తున్నారు. మీడియాపై ఆంక్షలు విధించారు.